NEW YEAR CELEBRATIONS 2025: రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. మార్కెట్లలో నూతన సంవత్సరం సందడి నెలకొంది. ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి అవసరమైన కేకులు, స్వీట్ల కోసం బేకరీల వద్ద బారులు తీరారు. ఇళ్లను అందంగా అలకరించుకోవడానికి అవసరమైన సామాగ్రితో పాటు ఇంటి ముందు ముగ్గులు వేయడానికి అవసరమైన రంగులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.
అధికారులు, ఆత్మీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి పుష్ప గుచ్ఛాల షాపులకు అనేక మంది క్యూ కట్టారు. దీంతో పాటు కొత్త సంవత్సరాన్ని పురష్కరించుకుని వస్త్ర దుకాణాలకు ప్రజలు వచ్చి వారికి కావాల్సిన బట్టలను కొనుగోలు చేశారు. దీంతో బెజవాడలోని ప్రధాన మార్కెట్లన్నీ కొనుగోలుదారుల తాకిడితో కిక్కిరిసిపోయాయి. రాకపోకలు సాగించే వాళ్లు అధికంగా ఉండటంతో రోడ్లపై రద్దీ నెలకొంది.
విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో కొత్త సంవత్సరం ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో చేరి కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన డప్పు కళాకారుల బృందం డప్పులు మోగిస్తూ హుషారెత్తించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. వీరి వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
మందుబాబుల కోసం ప్రత్యేకంగా: నూతన సంవత్సరం ప్రారంభ సమయం అనగానే మందుబాబులకు ఎక్కడ లేనంత ఉత్సాహం వస్తుంది. వారిని ఆకర్షించేందుకు వ్యాపారులు పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తారు. కాకినాడ జిల్లాలోని కేంద్ర బాలిక ప్రాంతం యానంలో మాంసాహారి ప్రియుల కొరకు కోళ్ల వ్యాపారులు ప్రత్యేక ధరలతో అమ్మకాలు చేపట్టారు. పర్యాటక శాఖకు చెందిన సీగల్స్ రెస్టారెంట్ తందూరి చికెన్ తయారీని ఓపెన్ మార్కెట్లో పెట్టి అమ్మకాలు చేపట్టింది.