New Vehicle in Telangana TG Registrations : శుక్రవారం నుంచి వాహనాల నంబరు ప్లేట్లను టీఎస్(TS) నుంచి టీజీ(TG)గా అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నంబరు ప్లేట్ల మార్క్‌లో టీజీగా మార్పు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, కేంద్రం అందుకు తగిన గెజిట్‌ను విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. టీఎస్ పేరిట ఉన్న వాహనాలు యధావిధిగా కొనసాగుతాయని, నూతన వాహనాలు మాత్రమే టీజీ పేరిట రిజిస్ట్రేషన్(New Vehicles New Registrations) అవుతాయని తెలిపారు.
అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫోర్టు డిపార్టుమెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 సంవత్సర డైరీ-క్యాలెండర్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. టీఎస్ నుంచి టీజీగా మార్పుపై వాహనదారుల్లో అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. డైరీ రూపొందించిన అసోసియేషన్ ఆఫ్ ట్రాన్‌పోర్ట్ డిపార్టుమెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ కార్యవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మార్గం రవీందర్, ఉపాధ్యక్షుడు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ నుంచి టీజీకి వాహనాల రిజిస్ట్రేషన్ మార్పు - నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
'తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకున్నాం. ప్రజల మనోభావాల మేరకు టీఎస్‌ను టీజీగా మారుస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను అణచివేసింది. శాసనసభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మార్చాలని కేంద్రానికి పంపించాం. టీఎస్ అక్షరాలను టీజీగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రేపట్నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు అన్నీ ఇకపై టీజీగా వస్తాయి. గత ప్రభుత్వం వలే జీవోలను మేము రహస్యంగా ఉంచాలనుకోవటం లేదు. ఈ ప్రభుత్వం జారీ చేసే చేసే జీవోలన్నింటిని ప్రజాబాహుళ్యంలో ఉంచుతాం. ఆర్‌టీఐ కింద పౌరులు కోరిన వివరాలు కూడా ఇవ్వాలని అధికారులకు చెప్తున్నామని' మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
TS to TG Vehicle Registration :తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఈ గెజిట్‌ను జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్లో సీరియల్ నంబరు 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇది వరకు ఉన్న టీఎస్ స్థానంలో టీజీ మార్కు కేటాయించినట్లు కేంద్ర రహదారి శాఖ స్పష్టం చేసింది. శాసనసభలో టీఎస్‌ను టీజీగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే కేంద్రానికి పంపించింది. ఇప్పుడు దీనిని అనుసరించి కేంద్రం మార్పు చేస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
అందుబాటులో 25 ఎలక్ట్రిక్ టీఎస్ఆర్టీసీ బస్సులు - ప్రారంభించిన మంత్రులు
ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా భారీగా పెంపు - ఎంత పెంచారంటే?