Registration Charges Hike From August 2024 :తెలంగాణలో ఆగస్టు 1 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాతవిలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకున్న పరిస్థితిపై అధ్యయనం చేపట్టనుంది.
ఈనెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జులై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. అనంతరం పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను ఖరారుచేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన తర్వాత ఆగస్టు నుంచి నూతన మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు-రిజిస్ట్రేషన్లశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
Telangana Govt Exercise To Hike Lands Price 2024 :గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరణలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆ శాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే-ల్యాండ్ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు.