New Ration cards and RytuBharosa :తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతికి రెండు రాష్ట్రాల్లోని కోట్లాది కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియనున్నాయి. ఓ వైపు ఏపీలోని కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండగకు భారీ కానుక ప్రకటించింది. రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించడంతో పాటు పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు డిసెంబర్ 2వ తేదీ నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. అర్హత ఉన్న వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలన్నీ పరిశీలించిన తర్వాత అర్హత ఉన్న వారికి నూతన కార్డులు మంజూరు చేస్తారని తెలిపింది. ఈ మేరకు బడ్జెట్ కూడా విడుదల చేసింది.
పేదలకు గుడ్న్యూస్ - ఈ సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో రైతు భరోసా...తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే సన్నధాన్యం కొనుగోళ్లపై బోనస్ అందిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురు అందించింది. రైతులందరూ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం నిధులను సంక్రాంతి తర్వాత విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరిట నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ రూ.16 వేల కోట్ల మిగులు నిధులతో తెలంగాణను కేసీఆర్‌కు అందిస్తే, రూ.7 లక్షల అప్పు మిగిల్చారని తెలిపారు. ఇక 2018 నుంచి 2023 వరకు ఐదేళ్లలో తీసుకున్న రుణాలన్నీ ఏకకాలంలో తీర్చామని, స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతు ఖాతాల్లో జమచేస్తామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలపై చర్చించనున్నట్లు సీఎం వెల్లడించారు.