New Railway Line Between Pandurangapuram to Malkangiri: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మేలు చేకూర్చేలా కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజరు (DRM) నరేంద్ర పాటిల్ తెలిపారు. పాండురంగాపురం - భద్రాచలం - మల్కన్‌గిరి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
ఈ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును గిరిజన ప్రాంతాల ద్వారా రైలు మార్గాన్ని అందిస్తూ, ఇది అసన్సోల్, వరంగల్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉంటుందని డీఆర్‌ఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ప్రాజెక్ట్ జునాగర్హ - నబరంగ్పూర్ - జీపూర్ - మల్కన్‌గిరి - భద్రాచలం - పాండురంగాపురం మధ్య అనుసంధానంను అందజేస్తుందన్నారు. 290 కిలోమీటర్ల మేర 7 వేల 383 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే లైన్‌ను చేపడతారన్నారు.
ఇది ఉత్తర, తూర్పు భారతదేశానికి అదనపు రైలు కారిడార్‌గా నిలుస్తుందని, దక్షిణ భారతదేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గును వేగంగా చేరవేయడానికి, అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడంలో ప్రయోజనకారిగా సహాయపడుతుందన్నారు. విజయవాడ - విశాఖపట్నం - భువనేశ్వర్ - కోల్‌కతా కోస్తా తీర ప్రాంతానికి నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ - భద్రాచలం - మల్కన్‌గిరి - జయ్‌పూర్ - టిట్లాగఢ్‌కు అదనపు రైలు మార్గాన్ని అందిస్తుందన్నారు.