Union Budget 2025 : కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి ఆశించిన పథకాలు, కేటాయింపులు ఏమీ దక్కలేదు. బిహార్, అస్సాం, అండమాన్, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్‌లకు మినహా ఏ రాష్ట్రానికి నేరుగా ఎలాంటి కేటాయింపులు, ప్రాజెక్టులు ప్రకటించలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాజక్టులకు ఆయా శాఖల ద్వారా కేటాయింపులు చేశారు. ఐఐటి, ట్రైబల్ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థలు, ఎయిమ్స్ వంటి వాటికి గతంలో నేరుగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినా ఈ ఏడాది ఆయా శాఖల ద్వారానే అవసరమైన నిధులు అందించనున్నారు.
ఆయా మంత్రిత్వ శాఖల ద్వారానే : రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సముద్ర పరిశోధనా, సమాచార కేంద్రం ఇన్కాయిస్కి 29 కోట్లు, అణు ఇంధన ఖనిజాల తవ్వకాల సంస్థకు 387.50 కోట్లు కేటాయించారు. నైపర్, ఐఐటి హైదరాబాద్, రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వ విద్యాలయాలకు గతంలో నేరుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికారు. ఆయా సంస్థలకు ఇప్పటికే ప్రత్యేక పద్దులు ఉన్న నేపధ్యంలో ఆయా మంత్రిత్వ శాఖల విభాగాల నుంచే నిధులు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఐఐటిలు, ఐఐఎంలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలను ఒకే జాబితాగా చేర్చి వాటికి ఉన్న పద్దు కింద నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఐఐటి హైదరాబాద్‌కు విదేశాల నుంచి రుణాలు ఈఏపీ కింద తీసుకునే జాబితాలో చేర్చారు.
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న కేంద్ర సంస్థలు జాతీయ మత్య్స సంపద అభివృద్ది బోర్డుకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులకు కేంద్ర హోం శాఖ ద్వారా ఇచ్చే పెన్షన్లు, ఐపీఎస్ అధికారుల శిక్షణా కేంద్రం వల్లభాయ్ పటేల్ అకాడమీకి, జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్ సంస్థ - ఎన్‌ఐఆర్‌డికి, అంతర్జాతీయ పౌడర్ మెటలర్జీలకు ఆయా శాఖల ద్వారా నిధులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.