New Pensions Released From January in AP :ఏపీప్రభుత్వం జనవరిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. జన్మభూమి-2 కార్యక్రమాన్ని జనవరిలో ప్రారంభించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు మార్గసూచి సిద్ధం చేసినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో అనర్హులకు ఇబ్బడిముబ్బడిగా పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ప్రధానంగా కొన్ని వేల మంది అనర్హులు దివ్యాంగుల కేటగిరీలో తప్పుడు సదరం ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వైఎస్సార్, అనంతపురం జిల్లాలతో పాటు మరికొన్నిచోట్ల ఇది బట్టబయలైంది.
చేనేత పింఛన్లలోనూ అనర్హులు ఉన్నట్లు తేలింది. దీంతో అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. పింఛన్ల తనిఖీ, కొత్త పింఛన్ల మంజూరుకు విధివిధానాల రూపకల్పన కోసం 8 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, డోలా బాల వీరాంజనేయస్వామి, గుమ్మిడి సంధ్యారాణి, సవితలతో ఉపసంఘం ఏర్పాటుకు రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కమిటీ ఏర్పాటైన 10-15 రోజుల్లోగా ప్రభుత్వానికి అందించనున్నట్టు తెలిసింది.