Baby Kidnap In Sangareddy Govt Hospital :సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో అపహరణకు గురైన శిశువు కథ సుఖాంతమైంది. కిడ్నాపైన 30 గంటల్లోనే కేసును ఛేదించి ఆ పసికందును పోలీసులు సురక్షితంగా కాపడగలిగారు. కిడ్నాపర్ల నుంచి పాపను రక్షించి సంగారెడ్డికి తీసుకువస్తున్నారు పోలీసులు. కిడ్నాపైన చిన్నారి ఆచూకిని హైదరాబాద్లో గుర్తించారు. దీంతో బిడ్డ దూరమై తల్లిడిల్లిన ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇదీ జరిగింది :పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దుడికొండ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అబ్బాస్ అలీ భార్య నశిమా ఐదో కాన్పుకోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. సిజేరియన్ ద్వారా ఆ గర్భిణి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే కొంత సేపటికే శిశువు అపహరణకు గురైంది. దీంతో ఆందోళన చెందిన ఆ పసికందు కుటుంబ సభ్యులు ఆసుపత్రి పరిసరాల్లో ఎంత వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వారు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును దర్యాప్తు చేపట్టారు. పాప కోసం తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు పాపను హైదరాబాద్లో గుర్తించారు. ఈ మేరకు ఆ ముఠా నుంచి శిశువును స్వాధీనం చేసుకుని సంగారెడ్డికి తీసుకువచ్చారు.