More than 20 Labours Traveling in Single Auto Dangerously :మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి కూలీల బతుకులు ప్రమాదం అంచులో ఉన్నాయి. జిల్లాలో సాగు నీరు పెరిగి పంటల విస్తీర్ణం విస్తరించింది. ఈ నేపథ్యంలో దీనికి స్థానికంగా సరిపడే కూలీలు లేకపోవడంతో బయట ప్రాంతాల నుంచి మరికొందరిని రప్పించాల్సిన అవసరం వచ్చింది. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎక్కువ మంది కూలీలను తరలిస్తున్నారు. ఒక ఆటోలో దాదాపు 20 నుంచి 25 మందిని తీసుకెళ్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఇక 8 సీట్ల వాహనంలో అయితే చెప్పక్కర్లేదు.
సాధారణంగా ఎప్పుడు ఏ రూపంలో రోడ్డు ప్రమాదం ముంచకొస్తుందో తెలియని పరిస్థితుల్లో ఇలా లెక్కకు మించి కూలీలను తరలిస్తుంటే అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. 2014 ముందు జిల్లాలో పత్తి సాగులేదు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఒకరిద్దరు మాత్రమే భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసేవారు. నీరు, ఖర్చుతో కూడిన పంట కావడంతో అక్కడున్న స్థానికులు సాగు చేసేందుకు ధైర్యం చేసేవారు కాదు. 2014 తర్వాత భీమా, జూరాల, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల వంటి సాగునీటి పథకాలు అందుబాటులోకి రావడంతో మండలాలకు సాగునీటి కొరత లేకుండా పోయింది. దీంతో పత్తి సాగు ఏటేటా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో సాధారణ విస్తీర్ణం 1,80,635 ఎకరాల పత్తి సాగు ఉంటే ఈ సంవత్సరం కూడా అంతే స్థాయిలో సాగు చేశారు.
పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నా : గత నెల రోజులుగా తొలి కాపు చేతికొచ్చింది. దీంతో పత్తి కూలీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రోజుకు ఒక్కొక్కరికి రూ.300 కూలీగా చెల్లిస్తున్నారు. స్థానికంగా సరిపడా కూలీలు లేకపోవడంతో బయటి మండలాల నుంచి రప్పిస్తున్నారు. పత్తి సాగు చేయని, సాగునీటి వనరులు అందుబాటులో లేని కర్ణాటక సరిహద్దు గ్రామాలతో పాటు దామరగిద్ద, మద్దూరు, కోస్గి మండలాల నుంచి కూలీలను నర్వ, ధన్వాడ, మక్తల్, మరికల్, ఆత్మకూర్ తదితర మండలాలకు తరచూ బొలేరా, ఆటోలు, ఇతర వాహనాలతో పాటు జీపుల్లో వస్తూ వెళ్తున్నారు. కానీ వీరి ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి.