National Space Day Celebrations in Vijayawada : చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కీర్తి పెరిగింది. సరికొత్త ఆ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై నెలరోజులుగా వేడుకలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా పలు ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణల ప్రదర్శలు జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడ వేదికగా పలు ఇంజినీరింగ్ కళాశాలలు స్పేస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
స్పేస్ డే వేడుకలు :దేశవ్యాప్తంగా పలు ఇంజినీరింగ్ కళాశాల్లో స్పేస్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. అంతరిక్ష ప్రయోగాలు, శాస్త్ర విజ్ఞాన అంశాలపై వాళ్లు తమ పరిశోధనలను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలు ఔత్సాహికులను ఆలోచింపజేశాయి.
పట్టుదల, కృషి - అద్భుతాలు సృష్టిస్తున్న వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు - VARIJA NETRA VIDYALAYA
తుమ్మలపల్లి కళాక్షేత్రంలోస్పేస్ డే :చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విట్ ఏపీ, కేఎల్ యూనివర్సిటీ, వెలగపూడి సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలతోపాటు ఇతర విద్యాసంస్థలు శాటిలైట్ అనుసంధాన విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ప్రతిభ కనబరిచిన ఇంజినీరింగ్ విద్యార్థులు :విట్-ఏపీ విద్యార్థులు విశాట్ నానో శాటిలైట్‌ను రూపొందించారు. ప్రోటోటైప్ శాటిలైట్ కోసం ఏడాది శ్రమించినట్లు తెలిపారు. దీంతోపాటు అంబులెన్స్‌లో రోగులను తరలించే సమయంలో అవసరమైన వైద్య పరీక్షలు చేసేందుకు అనువైన పరికరాన్ని రూపొందించారు. వ్యవసాయదారులకు పనికొచ్చేలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కలిగించే బహుళ ఉపయోగకర డ్రోన్ రూపొందించారు.