Gollapudi and Chinna Avutapalli West Bypass Road : సంక్రాంతికి పండుగకు విజయవాడ మీదుగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త! హైదరాబాద్ నుంచి ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇకపై సమయం ఆదా కానుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలను నిన్న( శుక్రవారం) నుంచే విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఇప్పటిదాకా వాహనాలు విజయవాడ నగరం గుండా వెళ్తుండేవి. దీంతో ట్రాఫిక్ రద్దీ వేళల్లో ఒక్కోసారి 2-3 గంటల సమయం పట్టేది. ఇకపై ఈ కష్టాలన్నీ తీరనున్నాయి.
కేవలం గంట ప్రయాణం : విజయవాడ శివారులోని గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి వరకు 30 కి.మీ. మేర కొత్తగా ఆరు వరుసల బైపాస్ నిర్మాణానికి 2020లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే అందులో 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. అయితే అక్కడక్కడ విద్యుత్తు హైటెన్షన్ వైర్లు తక్కువ ఎత్తులో ఉన్నాయి. అయినప్పటికీ వాహనాలు వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు గుర్తించారు. దీంతో సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా శుక్రవారం నుంచే రెండు వైపులా వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఈ బైపాస్‌తో గొల్లపూడి- చిన్నఅవుటపల్లి మధ్య ప్రయాణానికి కేవలం గంటలోపే సమయం పడుతుంది. త్వరలోనే ఈ మార్గంలో పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అందుబాటులోకి చిలకలూరిపేట బైపాస్ - ఆరువరుసల రోడ్డుపై దూసుకెళ్లనున్న వాహనాలు