Irregularities in R5 Zone: రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్‌లో పేదల పేరుతో అనర్హులు, వైఎస్సార్సీపీ నేతల అనుచరులకు గతంలో అక్రమంగా పట్టాలు కట్టబెట్టినట్లు తేలింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జాబితాను పరిశీలించగా అనర్హులు వేలల్లో ఉన్నట్టు గుర్తించారు. గత ప్రభుత్వం పెద్దల సహకారంతో పేదల ముసుగులో కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రయోజనం పొందారు.
ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా చర్యలు: వేరే మండలాల్లో ఉంటూ రాజధాని ఆర్ 5జోన్లో ఇళ్లు పొందిన వారికి సొంత గ్రామాల్లోనే ప్లాట్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ క్రమంలో ప్రభుత్వశాఖలు సర్వే నిర్వహించగా అవకతవకలు వెలుగుచూశాయి. పెదకాకాని మండలంలో 19 వందల 91 పట్టాలివ్వగా 197 మంది, తాడేపల్లి మండలంలో 2 వేల 96 మందికి ఇవ్వగా 313 మంది అర్హత లేనివారే. మంగళగిరిలో 3 వేల 732 మందికివ్వగా 573 మంది, తుళ్లూరు మండలంలో 13వందల 47 మందికి ఇవ్వగా 399 మందిని అనర్హులుగా గుర్తించారు.ఇప్పటి వరకూ 23వేల మంది లబ్ధిదారులకు సంబంధించి అధికారులు జరిపిన సర్వేలో పది శాతానికిపైగానే అనర్హులను గుర్తించారు. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఆర్-5జోన్ లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ స్థలాలు - ప్రభుత్వ నిర్ణయం
ఇళ్లు కట్టుకున్నవారి పేర్లూ సెంటు పట్టా జాబితాలో: అమరావతికి భూములు ఇచ్చిన రైతుల అభిమతాన్ని కాదని వేరే ప్రాంతాలకు చెందిన 50వేల మందికి నాటి సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ 5జోన్ లబ్ధిదారులతో పాటు టిడ్కో ఇళ్ల పొందిన వారి జాబితాను పోల్చి చూడగా వేల సంఖ్యలో అనర్హులు బయటపడుతున్నారు. టిడ్కో ఇళ్లు పొందినవారిలో కొంతమంది తమ కుటుంబ సభ్యుల పేర్లతో పట్టాలు పొందినట్లు గుర్తించారు. అప్పటికే ఇళ్లు కట్టుకున్నవారి పేర్లూ సెంటు పట్టా జాబితాలో ఉన్నాయి.
నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారి కుటుంబ సభ్యులు, గ్రామ సచివాలయ ఉద్యోగుల కుటుంబీకులు, పక్కాగృహాలున్న వారు, వైఎస్సార్సీపీ నేతల కుటుంబ సభ్యులు లబ్ధిదారుల జాబితాలో చేరిపోయారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లూ ఉన్నాయి.అమరావతి లేకుండా చేయాలని జగన్ పన్నిన కుట్రలో భాగంగా ఆర్5 జోన్ ఏర్పాటు చేశారని, పైకి మాత్రం పేదల కోసం స్థలాలిచ్చినట్లు మాయ చేశారని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు.
మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొంతమంది కాలువ గట్టు, కొండ పోరంబోకు, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. అభ్యంతరాల్లేని స్థలాల్లో ఉంటే వారికి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఇది అమలైతే సెంటు పట్టా జాబితాలో మరికొంతమంది తగ్గిపోతారు.
రాజధాని పునర్నిర్మాణంపై రోడ్ మ్యాప్ సిద్ధం - R5 జోన్‌తో మాస్టర్ ప్లాన్‌లో ఇబ్బందులు : CRDA