NHB Subsidy Scheme : మీకు సొంతభూమి ఉండి అందులో కూరగాయలు, పండ్లు, పూలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాలని అనుకుంటున్నారా? మీకు పెట్టుబడులు దొరక్కపోతే జాతీయ ఉద్యాన మండలి(ఎన్‌హెచ్‌బీ) రాయితీ పథకం ఆశాజనకంగా ఉంది. ఇందులో కొన్నింటికీ ఎన్‌హెచ్‌బీ భారీగా రాయితీలు ఇస్తోంది. అందులో ప్రధానంగా సూక్ష్మ సేద్య పరికరాలు, పాలిహౌస్, యంత్రాల కొనుగోలు, నెట్‌హౌస్‌ల నిర్మాణం, జంతువులు, పక్షుల నుంచి పంటలకు రక్షణ ఏర్పాట్లు, పంట కోతల అనంతరం శుద్ధి యూనిట్లు తదితర స్థిర మౌలిక వసతుల కల్పనకు ఈ రాయితీలు ఇవ్వనుంది. అయితే ఈ పథకానికి దరఖాస్తులు ఎలా చేసుకోవాలి? ఏఏ పత్రాలు ఉండాలి? అనేవి తెలుసుకుందాం.
ఇవీ పథకాలు :
- రక్షిత సాగు : రైతులు 2,500 చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల స్థలంలో టమాటా, క్యాప్సికం, కీర, దోస తదితర కూరగాయలను నెట్‌హౌస్ కింద సాగు చేయాలి. అలాగే గులాబీ, ఆర్పిడ్, అంథూరియం వంటి పూలను గ్రీన్‌హౌస్ కింద సాగు చేయాలి. ఈ ప్రాజెక్టుకు ఎన్‌హెచ్‌బీ రూ.1.12 కోట్ల వరకు మంజూరు చేస్తోంది. ఇందులో 50 శాతం అంటే రూ.56 లక్షలు రాయితీ లభిస్తుంది ఈ నిధులతో సాగు ఖర్చులతో పాటు యాంత్రీకరణ, ప్లాస్టిక్ మల్పింగ్, నెట్‌హౌస్ లేదా గ్రీన్‌హౌస్, యాంటీబర్డ్, టన్నెల్, హెయిల్ నెట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
- బహిరంగ క్షేత్రంలో సాగు : ఈ పథకం కింద 5 ఎకరాల్లో నిమ్మ, నారింజ, మామిడి, నేరేడు, సీతాఫలం, రేగు, అరటి, దానిమ్మ తదితర తోటల పెంపకానికి రైతులకు రూ.75 లక్షల వరకూ మంజూరు చేస్తారు. అలాగే ఇందులో 40 శాతం అంటే రూ.30 లక్షల వరకూ రాయితీ లభిస్తుంది. ఈ ప్రాజెక్టు కింద నేల చదును, మొక్కలు నాటడం, సూక్ష్మసేద్యం, యంత్రాల వినియోగం, ప్రాసెసింగ్ యూనిట్, నీటిపారుదల యూనిట్‌లను స్థాపించవచ్చు.
- పంట కోత అనంతర యాజమాన్య ప్రాజెక్టు : కూరగాయలు, పండ్లు, పువ్వులు, జీడిపప్పు, సుగంధమొక్కలు వంటి పంటల కోసం ప్యాక్‌హౌస్, రీపెనింగ్ ఛాంబర్, శుద్ధి యూనిట్‌లు, శీతలీకరణ నిర్మాణాలకు రైతులకు రూ.1.45 కోట్ల వరకూ మంజూరు చేస్తారు. అందులో 30 శాతం అంటే రూ.50.75 లక్షలు రాయితీగా ఇవ్వనున్నారు.
- రైతులు లేక ఇతరులు ఉద్యాన పంట ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు అంటే 5 వేల నుంచి 10 వేల టన్నుల సామర్థ్యం గల వాటి నిర్మాణానికి 35 శాతం రాయితీ ఇస్తుంది. ఖమ్మం జిల్లాలోని గుడిమళ్ల గ్రామానికి చెందిన రైతు మధుకు శీతల గిడ్డంగి నిర్మాణానికి రూ.9.2 కోట్ల ప్రాజెక్టు మంజూరు అయింది. ఇందులో రూ.1.99 కోట్లు రాయితీగా లభించింది.