NCB To Use Deportation on Foreign Criminals :డ్రగ్స్ మహమ్మారిపై విరుచుకుపడుతున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వీటిని సరఫరా చేస్తున్న విదేశీయులను కట్టడి చేసేందుకు గతానికి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వారిని అరెస్టు చేస్తున్నప్పటికీ బెయిల్‌పై బయటకు రాగానే మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి సరఫరాలో మునిగి తేలుతుండటంతో మత్తుపదార్థాల రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వారిపై డిపోర్టేషన్ (సొంత దేశానికి పంపించేయడం) అస్త్రం ప్రయోగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహా కేసుల్లో పరీక్షల నిర్వహణ, కేసుల నమోదు, సాక్ష్యాల సేకరణలో కచ్చితత్వాన్ని సాధించేలా సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అధికారులకు సీఎం కీలక ఆదేశాలు :రాష్ట్రంలో డ్రగ్స్ ఊసే వినిపించకూడదని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖల బాధ్యులకు పదేపదే స్పష్టంచేస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలోనూ ఈ విషయాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారు. వాస్తవానికి తెలంగాణలో గంజాయి సాగు లేదు. పొరుగునే ఉన్న ఏపీ నుంచి తీసుకొస్తున్నారు. కొంత సరకు ఇక్కడ వినియోగించి మిగిలినదానిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. యాఫింటమైన్ టైప్ స్టిమ్యులెంట్స్ (ఏటీఎస్)ను హైదరాబాద్ పరిసరాల్లోనే తయారు చేస్తున్నారు.
Supply Of Drugs From Abroad :హెరాయిన్, కొకైన్ వంటి ఖరీదైన మత్తుపదార్థాలను ఇతర దేశాల నుంచి అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్ర విదేశీయులదే వారిలో ముఖ్యంగా నైజీరియా దేశానికి చెందిన వారిదే. ఆఫ్రికా దేశాల్లో మత్తుమందుల వాడకం సాధారణ విషయమే. చదువుల పేరిట ఇక్కడికి వస్తున్న ఆఫ్రికన్లలో కొందరు మాదక డ్రగ్స్ వ్యాపారంలోకి దిగుతున్నారు. తమ వివరాలు తెలియకుండా ముంబయి, గోవా, బెంగళూర్లలో పాగా వేసి, హైదరాబాద్‌లో ప్రత్యేక సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయగలిగినట్లయితే పరిస్థితి చాలావరకు మెరుగవుతుంది.
విదేశీ కేటుగాళ్లపై డిపోర్టేషన్ అస్త్రం :2013 నుంచి ముంబయిలో ఉంటూ, వీసా గడువు ముగిసినా వెనక్కి వెళ్లిపోకుండా మత్తుమందుల సరఫరా వ్యాపారంలో ఆరితేరిన చౌకౌ ఎగ్బోన్న డేవిస్ అలియాస్ టోనీని అతికష్టంమీద హైదరాబాద్ పోలీసులు పట్టుకోగలిగారు. ఈ నెల 15న ఒనోహ బ్లెస్సింగ్ అనే మహిళ నార్కొటిక్స్ బ్యూరోకు పట్టుబడిన మహిళ 2018 నుంచి ఇదే వ్యాపారంలో ఉండటం గమనార్హం. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన 12 మంది మహిళలు, 27 మంది పురుషులు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ కేసుల్లో మొత్తం 300 మంది వరకు రిమాండులో ఉండగా వారిలో 10% మంది విదేశీయులే కావడాన్ని బట్టి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.