NTR Birth Anniversary in Telangana 2024 : ఎన్టీఆర్ ఆ పేరు తలవగానే తెలుగు నేల పులకిస్తుంది. ప్రజాసేవలో ఆయన ప్రతి అడుగూ, సమాజశ్రేయస్సు కోసం చేపట్టిన ప్రతిసంస్కరణ నేటి తరానికి మార్గదర్శకమై నిలుస్తుంది. సినీ వినీలాకాశంలో ధ్రువతారగా, రాజకీయ యవనికపై విజయానికి చిరునామాగా మారిన నందమూరి తారక రామారావు ప్రయాణంలో ప్రతి అడుగూ ఓ సంచలనం. తెలుగువారంతా నోరారా అన్నా అని పిలుచుకునే ఆయన 101వ జయంతి నేడు.
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతిని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, అంజలి ఘటించారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి, తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవమని బాలకృష్ణ అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ తొలుత చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు : ఆ తర్వాత ఎన్టీఆర్ చిత్రరంగంలోకి వచ్చారని, ఆయన అంటే నటనకు విశ్వవిద్యాలయమని బాలకృష్ణ తెలిపారు. సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. ఒకే పంథాలో వెళ్తున్న పాలిటిక్స్‌ను మార్చారని గుర్తు చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని వివరించారు.
"అంతకుముందు రాజకీయాలంటే కొంతమందికే పరిమితమై ఉండేవి. కానీ ఎన్టీఆర్ వచ్చాక డాక్టర్లు, లాయర్లు, అభిమానులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీనవర్గాలకు పదవులు కట్టబెట్టారు. ప్రభుత్వంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు." - బాలకృష్ణ, ఎన్టీఆర్ తనయుడు