Nalgonda sandeep gather various seeds :పచ్చని ప్రకృతి అంటే అందరికీ ఇష్టమే కానీ కొంత మంది మాత్రమే ఆ ప్రకృతిని కాపాడాలనుకుంటారు. పచ్చదనం కోసం పరితపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన యవకుడే సందీప్. ఇక్కడ తోటి మిత్రులతో కలసి విత్తనాలను సేకరిస్తున్న ఈ యవకుడి పేరు అవిరెండ్ల సందీప్ కుమార్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పురపాలికలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తన్నాడు. పీజీ వరకు చదివిన సందీప్‌కి చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ ఎక్కువ. పర్యావరణ పరిరక్షణ కోసం ఎదో చేయాలని తపన.
దాని కోసం ఎక్కడ ఖాళీ ప్రాంతం కనిపించిన మెుక్కలు నాటేవాడు. మొక్కలు ఖర్చు పెరగడంతో చెట్ల నుంచి వచ్చే విత్తనాలు సేకరించడం ప్రారంభించాడు. అలా సేకరించిన విత్తనాలను వానాకాలంలో ఖాళీ ప్రదేశాలు, కొండ, గుట్ట ప్రాంతాల్లో వెదజల్లేవాడు. దీనికి స్నేహితులు సైతం మద్దతు పలికారు. అందరూ కలిసి గత ఐదేళ్లగా విత్తనాల సేకరించడం.. వాటిని నాటడం బాధ్యతగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 30వేలకు పైగా పలు రకాల విత్తనాలు సేకరించారు. అత్యధికంగా కానుగ, మామిడి, చింత, పొగడ, నేరేడు, కాసియా ఫిస్టులా, వేప, సపోట వంటి విత్తనాలును సేకరించి ఖాళీ ప్రదేశాల్లో చల్లుతున్నారు.
establish green environment :మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వీటన్నింటికి ప్రధాన కారణం ఎడాపెడా చెట్లు నరకడం విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగించడం. పర్యావరణ పరిరక్షణకు తన వంతుగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. చెట్ల పెంపకంతోనే భూ తాపాన్ని తగ్గించవచ్చనే ఉద్దేశంతో విత్తనాల సేకరించి వాటిని గుట్ట ప్రాంతాల్లో నాటితే చెట్లు పెరుగుతాయని భావించి విత్తనాల సేకరిస్తున్నట్లు ప్రకృతి ప్రేమికుడు సందీప్ చెబుతున్నాడు. పచ్చని అడవులు ఉంటేనే పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కలకాలం పచ్చగా, ఆనందంగా జీవిస్తారని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని యజ్ఞంగా చేస్తున్నట్లు సందీప్ చెబుతున్నాడు. దీనికి స్నేహితులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారని చెబుతున్నాడు.
"మెుదట్లో సంచులు పట్టుకుని చెట్ల కింద విత్తనాలు ఏరుకుంటుంటే చాలా మంది హేళన చేశారు. అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగాం. తర్వాత తాము నాటిన విత్తనాలు మెుక్కలు రావడంతో పలువురు మెచ్చుకోవడంతో విమర్శించిన వాళ్లే అభినందిస్తున్నారు." -సందీప్ కుమార్, ప్రకృతి ప్రేమికుడు, మిర్యాలగూడ