Nagoba Jatara 2024 : దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే మెస్రం వంశీయుల జీవన విధానం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో వెలసిన నాగోబా జాతరతో ముడిపడి ఉంది. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలకు ఈ జాతర తలమానికంగా నిలుస్తోంది. నాగోబా జాతరతో అందరూ ఒకేచోట కలవాలనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఎడ్లబండ్లపై రావడం, మర్రి చెట్టు నీడన సేద తీరడం, గోదావరి నదికి పదిహేను రోజుల పాటు కాలినడకన వెళ్లి తీసుకొచ్చిన గంగాజలంతో అర్ధరాత్రి తుడుం మోతలు, సన్నాయి వాద్యాల నడుమ నాగోబా దేవతను అభిషేకం చేసే మహా పూజతో జాతర ప్రారంభమవుతుంది. జొన్న గట్క, సాంబారు, మినప పప్పు, నువ్వుల నూనె సహా పొలంలో పండించి సొంతంగా తెచ్చుకునే తొమ్మిది రకాల దినుసలతో నాగోబాకు నైవేద్యం సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది.
గంగాజలం కోసం మెస్రం వంశస్థుల పయనం - త్వరలో నాగోబా జాతర ప్రారంభం
దేశంలో మెస్రం వంశీయులు ఎక్కడ నివసించినా నాగోబా జాతర సందర్భంగా కేస్లాపూర్‌లో కలవాలనేది ఆచారంగా వస్తోంది. ఎడ్లబండ్లనే గుడారాలుగా మార్చుకొని ప్రతి ఒక్కరూ యోగక్షేమాలను తెలుసుకోవడమే కాదు, భవిష్యత్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం సంప్రదాయంగా విరాజిల్లుతోంది. చెట్టు, పుట్ట, చేను, పశుపక్షాదులన్నింటిలోనూ దైవాన్ని చూసే మెస్రం వంశీయులు, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటారు. పెళ్లయిన మహిళలు భేటి పేరిట నాగోబా సన్నిధిలో మొక్కు తీర్చుకుంటేనే మెస్రం వంశీయుల కోడలిగా గుర్తింపు లభిస్తోంది. ప్రతి ఒక్కరూ మర్రి చెట్ల కింద సేదతీరుతారు. అందరూ కలిసి ఆ రాత్రి యోగక్షేమాలను తెలుసుకుంటూ సమయాన్ని గడుపుతారు. అందరూ కలిసి భోజనాలు చేసి సంతోషంగా ఉంటారు.