Mynampally Hanumantha Rao Comments on BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారనీ రెండు మంత్రి పదవులు ఇస్తే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌లోకి వస్తానన్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేతపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో నమ్మకం లేదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.
అనవసరంగా తమను రెచ్చగొట్టి మిమ్మల్ని మీరే బొంద పెట్టుకోకండనీ హెచ్చరించారు. కాంగ్రెస్ ఒక్కసారి గేట్లు తెరిస్తేనే మీరు తట్టుకోలేకపోయారని ఇక పూర్తిగా తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. కేటీఆర్,హరీశ్ రావు కావాలనే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇక నుంచి వాళ్లే తమ టార్గెట్ అని అన్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వాళ్లవి క్రిమినల్ మైండ్లు అని, విద్యుత్ అధికారులు కొందరు వాళ్లకి సహకరిస్తూ రైతులకు కరెంటు కోతలు విధిస్తున్నారని అన్నారు. అలాంటి చర్యలకు పాల్పడ్డ అధికారులు సస్పెండ్ కాక తప్పదని హెచ్చరించారు.
"గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదు. ఆయన కావాలనే కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు చేయాలని చూస్తున్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారు. రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్లోతు వస్తానని అంటున్నారు." -మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే