Munneru Vagu Heavy Flood in Khammam :ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు అత్యంత ప్రమాదకర స్థాయిలో మహోగ్రంగా ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో పలు కాలనీవాసులు వరదలో చిక్కుకున్నారు. రాజీవ్ గృహకల్ప విలంగుల కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అపార్టుమెంట్‌లోని ఓ ఇంట్లో చిక్కుకున్న ఐదుగురు బాధితులు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. కల్వోడ్డు వెంకటేశ్వరనగర్‌లోని ఓ ఇంటిని వరద చుట్టుముట్టడంతో ఇంటిపైకి ఎక్కి ఏడుగురు బాధితులు తలదాచుకున్నారు. మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీలను వరద ముంచెత్తింది. వందల మంది బాధితులు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లు :ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు బ్రిడ్జిపై వరదలో చిక్కిన వారిని రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వచ్చే అవకాశం లేక ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌తో మంత్రి మాట్లాడారు. వెంటనే విశాఖపట్టణం నుంచి రెండు హెలికాప్టర్లు ఖమ్మం బయలుదేరి వెళ్లాయి.
ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మున్నేరు వరదలో చిక్కిన 9 మందిని కాపాడాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలిచ్చారు. ఖమ్మం నగరంలో వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవాలని స్వచ్చంద సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. అలాగే వారికి తాగునీళ్లు, ఆహారం అందించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.