DY CM Bhatti Review On Munneru Floods :ఖమ్మం జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు హుటాహుటిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా ఉన్నారు. వరద ప్రమాదంపై జిల్లాలోని ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భట్టి విక్రమార్క సూచించారు.
Minister Thummala On Munneru Floods : ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను తుమ్మల ఆదేశించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి తరలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ సూచనలను పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని కోరారు. అధికారులు వెంటనే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.