Kadambari Jethwani Case Updates : ముంబయి నటి కాదంబరీ జెత్వానీతో తమకు పరిచయం లేదని, ఆమెను ఎన్నడూ చూసింది కూడా లేదని ఆమె కేసులో కీలక సాక్షులైన నాగేశ్వరరాజు, భరత్ కుమార్ న్యాయాధికారి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కాదంబరీ నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేశామనడం పచ్చి అబద్ధమన్నారు. ఇందుకు గాను అడ్వాన్సుగా ఆమెకు రూ.5 లక్షలు చెల్లించలేదని స్పష్టం చేశారు. ఇదంతా ఈ కేసులో కీలక నిందితుడైన విద్యాసాగర్ అల్లిన కట్టుకథ అని వారు తేల్చిచెప్పారు.
ముంబయి నటి కాదంబరీ జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెలలో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఇప్పటికే నటి, మరో సాక్షి శ్రీనివాసరావు స్టేట్‌మెంట్లను కోర్టులో రికార్డు చేయించారు. తాజాగా విజయవాడలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులో కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన చిందా వీరవెంకట నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన బోరుకాటి భరత్‌కుమార్ వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ నమోదు చేశారు.
విద్యాసాగర్‌తో తమకు పెద్దగా సంబంధాలు లేవని నాగేశ్వరరాజు, భరత్‌కుమార్‌లు వాంగ్మూలంలో తెలిపారు. ఆయన తండ్రి మాజీ జడ్పీ ఛైర్మన్ నాగేశ్వరరావుతో సాన్నిహిత్యం ఉండేదని చెప్పారు. విద్యాసాగర్ 2014లో వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేశాడని అప్పుడే అతడ్ని చివరిసారిగా చూశామని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినీ నటిపై నమోదైన కేసులో తమను సాక్షులుగా చేర్చారని వారు పేర్కొన్నారు.