విశాఖపట్నంలో తహసీల్దార్ దారుణ హత్య - ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం MRO Brutally Murdered in Visakhapatnam: విశాఖ జిల్లా చినగదిలి రూరల్ తహసీల్దారు (Tahsildar Ramanaiah) సనపల రమణయ్య దారుణహత్యకు గురయ్యారు. రమణయ్య నివాసం ఉంటున్న కొమ్మాదిలోని చరణ్ క్యాస్టిల్ అపార్ట్‌మెంట్ వద్దే ఆయన హత్యకు గురయ్యారు. రమణయ్యపై గుర్తుతెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేయగా, ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. రమణయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
తీవ్ర చర్చకు దారితీసిన తహసీల్దార్ హత్య:నలుగురు దుండగులు ఇనుప రాడ్డుతో దాడి చేశారని స్థానికులు చెప్పారు. విశాఖ సీపీ రవిశంకర్ అయ్యర్ కేసు దర్యాప్తు చేపట్టారు. మండల మేజిస్ట్రేట్ ప్రాణాలకు భద్రత కరవవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై కలెక్టర్ మల్లికార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం రోజే బాధ్యతలు స్వీకరించిన రమణయ్య: కాగా విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్‌గా శుక్రవారం రోజు రమణయ్య బాధ్యతలు స్వీకరించారు. బొండపల్లి తహసీల్దార్‌గా విధుల్లో చేరి వచ్చిన రోజే దుండగులు దాడి చేశారు. విశాఖ రూరల్ చినగదిలి తహసీల్దార్‌గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి బదిలీ అయ్యారు. కొమ్మాదిలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని అయితో అంతస్తులో నివాసం ఉండే ఆయన, శుక్రవారం బాధ్యతలు చేపట్టి ఇంటికి చేరుకున్నాడు.
ఇనుప రాడ్డుతో దాడి: రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్‌మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దుండగులు ఇనుపరాడ్డుతో తహసీల్దార్‌పై ఒక్కసారిగా దాడి చేశారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే రమణయ్య కుప్పకూలిపోయాడు. వాచ్‌మెన్ గట్టిగా కేకలు వేయడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే వాచ్‌మెన్ తహసీల్దార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో తహసీల్దారు సనపల రమణయ్య మృతి చెందారు.
నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు:తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో అనుమానితులను విచారిస్తున్నారు. నిందితుల గాలింపు కోసం 12 బృందాలను ఏర్పాటు చేసిన విశాఖ సీపీ రవిశంకర్, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తహసీల్దార్ రమణయ్యకు వచ్చిన కాల్స్ ఇతర అంశాలను పొలిసు అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, తహసీల్దార్ హత్యతో రెవెన్యూ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.