Mother-in-Law Kills Daughter-in-Law in Shamshabad :ప్రేమకు కులం, మతం, ప్రాంతాలతో సంబంధం ఉండదు. కానీ కొంత మంది తల్లిదండ్రులు తమ పరువు ఎక్కడ పోతుందో అని ప్రేమ పెళ్లికి అంగీకరించరు. కొందరు మాత్రం తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకుంటారు. ఇదే విధంగా 20 సంవత్సరాల క్రితం ఓ ప్రేమ జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కోడలిపై పగ పెంచుకున్న అత్తామామ, ఆమెను అతి కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చోటు చేసుకుంది.
భార్యాభర్తల మధ్య గొడవలు : తమకు ఇష్టం లేకుండా కుమారుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కోడల్ని అత్తా మామలు హత్య చేసి పాతిపెట్టిన సంఘటన ఇది. 2 నెలల కిందట జరిగిన హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామాంజపూర్ తండాకు చెందిన దూలి (38), అదే తండాకు చెందిన మూడావత్ సురేష్ (డ్రైవర్) 20 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పారు. మూడావత్ సురేష్ తల్లిదండ్రులు తులసి, అనంతి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా వారి మాటను కాదని దూలి, మూడావత్ సురేష్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు. తమకు ఇష్టం లేకుండా తమ కుమారుడిని వివాహం చేసుకుందని అత్తా మామ తులసి, అనంతి కోడలిపై పగ పెంచుకున్నారు. మూడావత్ సురేష్ కొద్ది సంవత్సరాలుగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో దూలి తరచూ భర్తతో గొడవపడేది. ఈ విషయంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అనంతరం ఇద్దరూ కలిసి మంచిగా ఉండాలని సర్ది చెప్పారు.