Mother Passed After Barasala Celebration : 'అమృతానికి, అర్పణకు అసలు పేరు అమ్మ. అనుభూతికి, ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ. ఈ లోకమనే గుడిజేరగ తొలి వాకిలి అమ్మ' అన్నారు ఓ మహాకవి. అటువంటి తొలి వాకిలి, అమ్మా అను తియ్యదనానికి బారసాల నాడే ఓ పసికందు దూరమైన హృదయ విదారక ఘటన శుక్రవారం హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఊయల ఊపి జోలపాటలు పాడే తల్లి, పురుడు రోజునే దూరమవ్వటంతో అక్కడున్న బంధుగణమంతా మూగపోయింది. కుమార్తె బారసాల ముగిసిన గంటల వ్యవధిలోనే గుండెపోటుతో తల్లి మృతి చెందడంతో, ఆ కుటుంబసభ్యుల రోదన మిన్నంటింది. పాపం ఆ పాపాయికి ఏం తెలుసు విధి ఆడిన వింత నాటకంలో తన తల్లి తనను శాశ్వతంగా వీడిందని.
మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన మామిడాల రాజశేఖర్ - శిరీష (28) దంపతులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తూ అక్కడే నివాసముంటున్నారు. వీరికి రెండో సంతానంగా 21 రోజుల క్రితం కుమార్తె పుట్టింది. ఆ పసికందుకు గురువారం బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య హైదరాబాద్‌లోనే బారసాల ఘనంగా నిర్వహించారు. రాత్రి వరకు అందరూ కలిసి మెలిసి భోజనాలు చేసి, ఆనందోత్సాహాల మధ్య సందడిగా వేడుక ముగించుకుని అంతా నిద్రలోకి జారుకున్నారు.