తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న హైవేలపై ఆగి ఉన్న వాహనాలు - వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు - Telangana Road Accidents

Road Accidents in Telangana : తెలంగాణలో హైవేలపై ఆగి ఉన్న వాహనాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనలు ఎక్కువగా హైవేలపై జరిగినవి కావడం గమనార్హం. దీంతో అప్రమత్తమైన పోలీసులు, జాతీయ రహదారులపై గస్తీ పెంచాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 9:02 AM IST

Telangana Road Accidents :ఓవైపు వేసవి సెలవులు. మరోవైపు శుభకార్యాలు. వెరసి ఎండాకాలంలో, ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో రెండు, మూడు రోజులుగా వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి. అయినా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలు కొనసాగుతున్నాయి.

Road Accident Cases in Telangana : గురువారం నాడు కోదాడ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. పటాన్‌చెరు వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యాపారి సజీవ దహనమయ్యారు. అంతకు రెండు రోజులకు ముందు సూర్యాపేట వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను, కారు ఢీకొట్టిన ఘటనలో యువ దంపతులు మరణిచారు. బుధవారం నాడు వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు ఇంటర్‌ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మిగతా అన్ని ప్రమాదాలు కలుపుకొని రెండు రోజుల్లోనే తెలంగాణలో 25 మందికిపైగానే అర్ధాంతరంగా తనువు చాలించారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా హైవేలపై నిలిపి ఉంచిన లారీలు, ఇతర వాహనాలను ఢీకొట్టడం వల్ల జరిగినవే కావడం గమనార్హం.

నిద్దరోతున్న నిఘా : జాతీయ రహదారులపై వాహనాలు నిలపరాదు. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆయా రహదారులపై గస్తీ లేకపోవడమే. వాస్తవంగా ఆయా రహదారుల పరిధిలోని పోలీస్‌స్టేషన్ల సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలి. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేసులు నమోదు చేయాలి. డ్రైవర్లు వాహనంలో లేనిపక్షంలో వాటిని అక్కణ్నుంచి తొలగించాలి. ఇవేమీ జరగడం లేదు.

రహదారి భద్రతా మండలి ఉన్నా : తెలంగాణలో ప్రత్యేకంగా రహదారి భద్రతా మండలి ఉంది. దానికి ప్రత్యేక సదుపాయాలు ఏవీ లేవు. గస్తీ కోసం వాహనాలు సమకూర్చాలన్న ఆ సంస్థ ప్రతిపాదన చాలాకాలంగా రాష్ట్ర సర్కార్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. కనీసం వాహనాలు, వాటికి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తే శాంతిభద్రతల పోలీసులతో సంబంధం లేకుండా తామే నిరంతరం గస్తీ నిర్వహిస్తామని, తద్వారా ఇలాంటి ప్రమాదాలు నివారించడం వీలవుతుందని రహదారి భద్రతా మండలి అధికారులు చెబుతున్నారు. అయినా వాటిని పట్టించుకునే వారు కరవయ్యారనే విమర్శలున్నాయి.

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి - Kodad Road accident today

ప్రమాదాల నెల -మే! : దేశవ్యాప్తంగా సాధారణంగా మే నెలలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా మిగతా అన్ని నెలల కంటే మే నెలలో ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. ఆ నెలలో 43,307 ప్రమాదాలు జరగ్గా 16,791 మంది మృతిచెందారు. మార్చిలో 40,307 ప్రమాదాలు, 14,859 మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో 39,033 ప్రమాదాలు, 14,489 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తంగా ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,68,491 మరణాలు సంభవించాయి. వీటిలో దాదాపు నాలుగో వంతు ప్రమాదాలు, మూడో వంతు మరణాలు కేవలం మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లోనే సంభవించాయి.

ఇందుకు ప్రధాన కారణం వేసవి సెలవులు, శుభకార్యాలు. మరోవైపు విద్యా సంస్థలకు సెలవులు ఉండటంతో కుటుంబాలతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతోపాటు వివాహాలు, ఇతర శుభకార్యాలు ఈ కాలంలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే రహదారులపై రద్దీ పెరగడం కూడా ప్రమాదాలకు కారణం అవుతోంది. ఈ సమయాల్లో గస్తీ పెంచితే ఉల్లంఘనలకు పాల్పడేవారిని, మితిమీరిన వేగంతో ప్రయాణించే వారిని గుర్తించవచ్చు. తద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు. ఇదేమీ జరగకపోవడంతో రహదారులపై మారణహోమం కొనసాగుతోంది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఎట్టకేలకు పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. హైవేలపై గస్తీ పెంచాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు.

రేస్‌ ట్రాకుల్లా హైదరాబాద్‌ రహదారులు - మితిమీరిన వేగంతో ప్రాణాలు తీస్తున్న మందుబాబులు - Hyderabad Road Accidents

ఒకే బైక్​పై ప్రయాణం - బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి - Wardhannapet Road Accident Today

ABOUT THE AUTHOR

...view details