50 Hanuman Temples in Jagital District : హనుమాన్ జయంతి వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో ఉండే కోలాహలమే వేరు. ఎటుచూసినా ఆంజనేయస్వామి దేవాలయాలతో ఊరంతా జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిపోతుంది. ఏ గ్రామానికి లేని విధంగా సుమారు 50 అంజన్న ఆలయాలతో తన విశిష్టతను చాటుకుంటుంది. ఏ వీధిలో చూసిన హనుమాన్ భజనలతో ఆధ్యాత్మిక శోభ విలసిల్లుతుంది. ఆ గ్రామమే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని వెల్లుల్ల.
వెల్లుల్ల గ్రామంలో వీధికో ఆంజనేయస్వామి గుడి ఉంటుంది. అలా 50కిపైగా ఆలయాలున్నాయి ఇక్కడ. ఈ హనుమాన్ మందిరాల్లో నిత్యం పూజలు చేస్తూ అక్కడి కుటుంబాలు భక్తిభావాన్ని చాటుకుంటున్నాయి. ఇలా ఆ స్వామికి అనుదినం పూజలు చేయడం వల్ల అక్కడ ఏడాదిపాటు సమృద్ధిగా వర్షాలు పడతాయని వారి విశ్వాసం. పాడిపంటలు, ఆ ఊరు ప్రజలంతా బాగుంటారని అక్కడి ప్రజలకు ఆది నుంచి వస్తున్న ఓ నమ్మకం.
కొండగట్టులో వైభంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు - రామ నామస్మరణతో మార్మోగుతున్న ఆలయం
అయితే ఊరులో మాత్రం మరో నానుడి ఉంది. కొన్నేళ్ల క్రితం ఇక్కడ అత్యధికంగా బ్రాహ్మణ కుటుంబాల వారు నివసించేవారని, అలా ఎవరికి వారే వాయుపుత్రుడిని పూజించుకునేవారని పెద్దలు చెబుతున్న మాట. ఆ బ్రాహ్మణులు అందరూ వివిధ ప్రదేశాలకు వలసలు వెళ్లిపోవడంతో ఈ ఆలయాలు ఇక్కడ ఉండిపోయాయని చెప్పారు. ప్రతి ఏటా స్వామి వారికి పూజలు చేస్తూ గ్రామంలో హనుమాన్ దీక్షాపరులు పెరుగుతూనే ఉన్నారు. హనుమాన్ జయంతి వచ్చిందంటే చాలు ఈ గ్రామమంతా కాషాయవర్ణంగా మారిపోతుంది.