Passengers Traveling Dangerously: కూర్చోవాల్సిన ఆటోలో లెక్కకు మించి ప్రయాణికులను కుక్కుతున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కూలీలు నిత్యం ప్రమాదపు అంచులో ప్రయాణిస్తున్నారు. జిల్లాకు వ్యవసాయ పనుల కోసం బయట ప్రాంతాల నుంచి కూలీలు వస్తూ ఉంటారు. అయితే ఇదే అదనుగా కొంతమంది ప్రైవేట్ వాహనదారులు ఇష్టారీతిన కూలీలను తరలిస్తున్నారు. ఒక్కో ఆటోలో దాదాపు 20 నుంచి 25 మందిని తీసుకెళ్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం ముంచకొస్తుందో తెలియని పరిస్థితుల్లో లెక్కకు మించి కూలీలను తరలిస్తున్నారు.
ఏకంగా 50 మందిని కుక్కుతున్నారు: సాధారణంగా ఆటోలో డ్రైవర్‌తో సహా అయిదుగురు మాత్రమే ప్రయాణించాలి. కానీ దాదాపు 20 మందికి మించి కూలీలను తరలిస్తున్నారు. బొలెరోలో అయితే ఏకంగా 50 మందిని కుక్కుతున్నారు. జీపుల్లోనూ 30 మందిని తీసుకెళ్తున్నారు. వాహనాలకు వేలాడుతూ, దానిపై కూర్చొని, అటు ఇటు నిలబడి, ఎలా పడితే అలా ప్రయాణం చేస్తున్నారు. పోలీసులకు ఈ విధంగా ఎక్కువ మందితో వాహనాలు కనిపిస్తే కూలీలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
తాము ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నామని, వాహనాల్లో లెక్కకు మించి కూలీలు కనిపిస్తే తప్పకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు. కేసులు సైతం నమోదు చేస్తున్నామని, వాహనదారులను హెచ్చరిస్తున్నామని మక్తల్ సీఐ చంద్రశేఖర్ అన్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదని, ఏమైనా ప్రమాదం జరిగితే కుటుంబాల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు.