Police Notices To BRS MLC P Srinivas Reddy :నగర శివారులోని మొయినాబాద్ ఫామ్‌హస్‌లో కోడి పందాలు, క్యాసినో వ్యవహారంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 61 మంది పై గేమింగ్ యాక్టు కింద కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు.
ఎమ్మెల్సీ పి శ్రీనివాసరెడ్డికి పోలీసుల నోటీసులు :మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోడి పందాల నిర్వాహణ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ క్యాసినో, కోడి పందాలు ఆడిన 61మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఫామ్‌హౌస్ యజమాని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి నాలుగు రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఎప్పటి నుంచి ఫామ్‌హౌస్ లీజుకు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎన్ని ఏళ్లు లీజుకు ఇచ్చారు? ఫామ్‌హౌస్‌లో జూదం, క్యాసినో, కోడి పందాలు కొనసాగుతున్నట్టు తెలుసా అనే కోణాల్లో శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. ఈ తతంగమంతా శ్రీనివాస్‌రెడ్డికి తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే ఆయనను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అయితే శ్రీనివాస్‌రెడ్డి పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును చేర్చారు. కేవలం లీజుకు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా అసలు ఫామ్‌హౌస్‌లో ఏం జరుగుతోందని నిఘా ఉంచాల్సిన బాధ్యత కూడా యజమానిపై ఉందని పోలీసులు చెబుతున్నారు. లీజుకు ఇచ్చి ఏమీ పట్టనట్టు ఉండడం సరికాదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఫామ్‌హౌస్ లీజు పత్రాలను తమకు అందజేయాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.