Rain Alert for Telangana : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతం బంగ్లాదేశ్ తీరం గ్యాంగ్టక్, పశ్చిమ బంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉంది. అది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి, అదే ప్రాంతంలో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణకు వర్షాలు వచ్చే అవకాశం ఉంది.
నేడు గాలి విచ్ఛిన్నతి 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. మూడు రోజుల పాటు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.