తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్​ ట్యాపింగ్​ కేసు అప్​డేట్​ - రేవంత్ రెడ్డిపై స్పెషల్ నిఘా - కుట్రలో ఎమ్మెల్సీ నవీన్​రావు - TELANGANA PHONE TAPPING CASE UPDATE

Telangana Phone Tapping Case New Updates : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కుట్రలో నవీన్‌రావుకు భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. నవీన్‌రావు సహా ఓ మీడియా సంస్థ నిర్వహకుడు శ్రవణ్‌రావు సూచనలతోనే ప్రణీత్‌రావు బృందం పలువురి ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు నిర్ధారించారు. హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో కీలక అంశాలను పోలీసులు వెల్లడించారు.

Phone Tapping Case New Updates
Phone Tapping Case Updates (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 8:21 AM IST

Updated : Jul 4, 2024, 8:43 AM IST

Tapping Case in Telangana Update : హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎస్​ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కీలకమని పేర్కొన్నారు. రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్​లు, ఐపీఎస్​ లు, న్యాయమూర్తులు, పాత్రికేయులు ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్ చేసినట్లు వివరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని విదేశాలకు పరారైన ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును విచారించడం కీలకమని పోలీసులు హైకోర్టుకు వివరించారు. ఇంటర్‌పోల్‌ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరిని దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల పాస్‌పోర్టులను జప్తు చేయాలని రీజనల్ పాస్‌పోర్టు అథారిటీకి ప్రతిపాదించినట్లు హైకోర్టుకు వెల్లడించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ డేటాతోపాటు ఎస్​ఐబీకి సంబంధించిన 62 హార్డ్ డిస్క్‌లను నిందితులు ధ్వంసం చేశారని వివరించారు. ఎస్​ఐబీలోని క్యాట్ టీమ్, యూఎఫ్ టీమ్‌ల సమాచారాన్ని తొలగించారని నివేదించారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ప్రతినిధులు గతంలో సమకూర్చిన 3 సర్వర్లు, 5 యాపిల్ హార్డ్​డిస్క్‌లను ఆ సంస్థ ప్రతినిధులే స్వయంగా వచ్చి తొలగించారని హైకోర్టుకు వెల్లడించారు. మావోయిస్టు సంబంధ సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు నష్టం చేకూర్చారని పేర్కొన్నారు.

కేటీఆర్​, ఎమ్మెల్సీ నవీన్​రావు ఆదేశాల మేరకే : కేటీఆర్​, ఎమ్మెల్సీ నవీన్​రావు సహా బీఆర్​ఎస్​ అగ్రనేతల ఆదేశాల మేరకు సైబరాబాద్​ పోలీసులపై ప్రభాకర్​రావు ఒత్తిడి తెచ్చారు. దీంతో శ్రీధర్​రావుపై క్రిమినల్​ కేసులు పెట్టించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రస్తుత సీఎం రేవంత్​ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సంభాషణలనూ ప్రణీత్​ బృందం ఇంటర్​ స్టెప్​ చేసింది. ఈ ప్రక్రియను ఆర్​ఆర్​ అంటే రేవంత్​ రెడ్డి మాడ్యూల్​లా వ్యవహరించారు.

వీరి డేటా సేకరణ : రేవంత్​ రెడ్డి, కొండల్​ రెడ్డి, తిరుపతి రెడ్డి, వినయ్​ రెడ్డి, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఈటల రాజేందర్​, ఈటల నితిన్​, ధర్మపురి అర్వింద్, ప్రస్తుత ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, ఐపీఎస్ ఎ.ఆర్.శ్రీనివాస్, రాఘవేంద్రరెడ్డి, రమేశ్‌రెడ్డి, రోనాల్డ్ రోస్, ఐఏఎస్ దివ్య, శశాంక్ తాతినేని, సునీల్‌రెడ్డి, చిలుక రాజేంద్రరెడ్డి, కె.వెంకటరమణారెడ్డి, నరేంద్రనాథ్ చౌదరి, తీన్మార్ మల్లన్న, మహేశ్వర్‌రెడ్డి, ఏఎంఆర్ ఇన్‌ఫ్రా, వీరమల్ల సత్యం, మేఘా శ్రీనివాస్‌రెడ్డి , మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిషోర్ వంటి సీడీఆర్​, ఐడీపీఆర్​ డేటాను సేకరించినట్లు పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్లు అక్రమ ట్యాపింగ్​ ద్వారా బహిర్గతం : రాజకీయ నేతల ప్రొఫైళ్లను తయారు చేయడంతోపాటు వారి సీడీఆర్​ సమాచారాన్ని ప్రణీత్​రావు తన వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్‌లో భద్రపరిచారు. ఆ సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్‌ను తన బావమరిది దిలీప్ సహకారంతో రీప్లేస్ చేశారు. అనంతరం తొలగించిన హార్డ్ డిస్క్‌ను బేగంపేట నాలాలోకి విసిరేశారు. అలాగే సెల్​ఫోన్ ఫార్మాట్​ చేసుకోవాలని తన బృందం సభ్యులకు సూచించారు. 2022 అక్టోబరులో వెలుగులోకి వచ్చిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అక్రమ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బహిర్గతమైంది. దిల్లీకి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజీ స్వామితో కోరె నందకుమార్ సాగించిన ఫోన్ కాల్స్‌ను ప్రణీత్ దొంగచాటుగా విన్నారనీ పోలీసులు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అనంతరం ఆ సమాచారాన్ని తన పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి ప్రభాకర్‌రావుకి ఇచ్చారనీ తెలిపారు. ఆ సమాచారమే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైందన్నారు. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా మార్చి 22న ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణారావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ డాక్యుమెంటరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ వంటి 42 వస్తువులను జప్తు చేశారు. మార్చి 23న ప్రభాకర్‌రావు ఇంట్లో సోదాలు చేశారు. కానీ అక్కడ ఏ ఒక్క ఆధారం లభించలేదని పోలీసులు తెలిపారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం ఉద్యోగి ఒకరు అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను తీసి ప్రణీత్‌రావుకు పంపించినట్లు వెల్లడైంది.

ఎస్​ఐబీ చీఫ్​గా ప్రభాకర్​ రావు నియామకం : ప్రభాకర్‌రావు ఎస్​ఐబీ చీఫ్‌గా పనిచేసి 2020 జూన్ 30న పదవీ విరమణ పొందారు. అనంతరం జులై 1 నుంచి మూడేళ్ల కాలానికి ఆయన్ని చీఫ్ ఆఫ్ ఆపరేషన్‌గా పునర్‌ నియమించారు. 2020 జులై 10న హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నంబర్‌ 18ని జారీ చేశారు. అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఉద్దేశించిన జీవోల్లో మార్పులు చేస్తూ ప్రభాకర్‌రావుకు బాధ్యతల్ని కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చారు. టెలిఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసెస్‌ను ఇంటర్‌స్టెప్‌ చేసేందుకు అధీకృత సంతకందారుడిగా ప్రభాకర్‌రావును నియమించారు.

గతంలో ఐజీలకు మాత్రమే ఈ అధికారముండేది. అయితే ఐజీ స్థానంలో చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ హోదాలో ప్రభాకర్‌రావును నియమించడంపై జులై 20న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్-డీవోటీ డైరెక్టర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరుసటి రోజే డీవోటీ డీజీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్పటి ఐజీ ప్రత్యుత్తరమిచ్చారు. ఐజీ హోదాలోనే విరమణ పొంది మూడేళ్ల కాలానికి పునర్‌ నియామకం పొందినందుకే ప్రభాకర్‌రావును అధీకృత సంతకందారుడిగా నియమించినట్లు వెల్లడించారు.

Phone Tapping Latest News : అదే నెల 22న డీవోటీతో సహా టెలికం సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు అప్పటి హోంశాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 419 ఏ కింద ప్రభాకర్‌రావును అధీకృత సంతకందారుగా నియమించినట్లు లేఖల్లో పేర్కొన్నారు. ప్రభాకర్‌రావు బృందం ఇంటర్‌స్టెప్‌ చేసిన ప్రముఖుల్లో గాలి అనిల్‌కుమార్‌, రామసహాయం సురేందర్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, ఈటల రాజేందర్, కాసాని జ్ఞానేశ్వర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఫోన్​ ట్యాపింగ్​ కేసు నిందితులకు చుక్కెదురు - బెయిల్​ పిటిషన్​ను కొట్టేసిన కోర్టు

ఫోన్​ ట్యాపింగ్​ కేసు న్యూ అప్​డేట్ : నలుగురు నిందితులపై మరోసారి ఛార్జిషీట్​ - రేపు విచారణ - Phone Tapping Case Chargesheet

Last Updated : Jul 4, 2024, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details