MLC Kavitha Petition in Supreme Court : దిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరగతుండగానే తనను అరెస్ట్ చేశారని పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి, తనను అక్రమంగా అరెస్టు(Illegal Arrest) చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి, దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది ఇవాళ ఆన్లైన్లో పిటిషన్ దాఖలు చేశారు.
KTR and Harish Rao Meet Kavitha :ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు దిల్లీలోని ఈడీ కార్యాలయంలో కలిశారు. రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతిచ్చిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కవిత భర్త అనిల్‌కుమార్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, న్యాయవాది మోహిత్‌రావులు ఆమెను కలిశారు.
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత కుట్రదారు - కస్టడీ పిటిషన్‌లో వెల్లడించిన ఈడీ
కస్టడీలో భాగంగా తొలి రోజైన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కవితను ఈడీ(ED Arrest Kavitha) విచారించింది. విచారణ ముగిసిన అనంతరం ఆమెను కలవడానికి కుటుంబసభ్యులకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈడీ కార్యాలయం వరకు పార్లమెంట్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా వచ్చినా, వారు బయటే ఉండిపోయారు. కవితను కలిసిన తర్వాత కుటుంబీకులు ఎవరూ మీడియాతో మాట్లాడలేదు.