కవిత కస్టడీ పిటిషన్‌లో ఈడీ కీలక విషయాలు MLC Kavitha Custody Petition : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక విషయాలను వెల్లడించింది. ఈ కేసులో ఆమెను కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారని పేర్కొంది. సౌత్ గ్రూప్‌నకు చెందిన కవిత, శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ తదితరులు ఆప్ నేతలతో కలిసి కుట్ర పన్నారని తెలిపింది మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించినందుకు మధ్యవర్తుల ద్వారా ఆప్ నేతలకు లంచం రూపంలో రూ.100 కోట్లు సమర్పించడం సహా, రూ.192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడించింది.
Delhi Liquor Scam Updates :ఇందుకోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాతో కవిత (BRS MLC Kavitha) బృందం ఒప్పందం కుదుర్చుకుందని ఈడీ తెలిపింది. ఆప్ నేతలకు లంచం ఇచ్చినందున ఆమెకు అనుకూలంగా మద్యం విధానం రూపొందిందని పేర్కొంది. అలాగే కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఇండో స్పిరిట్‌లో ఎలాంటి పెట్టుబడి లేకుండానే భాగస్వామ్యంతోపాటు మద్యం ఉత్పత్తిలో దేశంలోనే పేరొందిన పెర్నాడ్ రికార్డ్ సంస్థలో డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం దక్కిందని ఈడీ వివరించింది.
ఈ క్రమంలోనే 2021-22 దిల్లీ మద్యం పాలసీలో (Delhi Liquor Scam) ఎల్1గా నిలిచిన ఇండో స్పిరిట్‌కు అత్యధిక లాభాలు దక్కాయని ఈడీ పిటిషన్‌లో వెల్లడించింది. లిక్కర్ పాలసీలో హోల్ సేలర్లకు లాభాల వాటాను 12 శాతానికి పెంచడం ద్వారా సౌత్ గ్రూప్‌నకు లబ్ధి చేకూరడమే కాకుండా వాటిల్లో నుంచే ఆప్ నేతలకు అక్రమ నిధులు అందేలా కుట్ర జరిగిందని పేర్కొంది. కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణకు రావడంతో అరెస్ట్ చేసినట్లు తెలిపింది.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన బాట - కేంద్రం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు
విజయ్‌నాయర్ కలిసి వెళ్లిన అనంతరమే నివేదిక :లిక్కర్ పాలసీలో కవిత బృందానికి అనుకూల విధానల రూపకల్పన కుట్రకు 2021 మార్చి 19న కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా ప్రతినిధి విజయ్‌నాయర్ హైదరాబాద్ పర్యటనకు మధ్య సంబంధముందని ఈడీ వివరించింది. ఆ మరుసటి రోజు హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్‌లో వాట్సాప్ ఛాటింగ్‌ల విశ్లేషణలో ఇది తెలిసిందని పేర్కొంది. అయితే మార్చి 15-19 మధ్య దిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్, స్టెనో సునీల్‌సింఘాల్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల మేరకు కాకుండా, విజయ్‌నాయర్ కవితను హైదరాబాద్‌లో కలిసి వెళ్లిన తర్వాత 22న మద్యం విధానం నివేదికకు తుదిరూపం వచ్చినట్లు గుర్తించినట్లు ఈడీ కోర్టుకు దృష్టికి తీసుకెళ్లింది.
7 Days ED Custody MLC Kavitha : 2023 ఆగస్టు 8న కవిత వ్యక్తిగత సిబ్బంది నుంచి వాంగ్మూలం సేకరించామని ఈడీ వివరించింది. ఈ మేరకు ఆమె అనుచరుడు అభిషేక్ బోయినపల్లి సూచనల మేరకు దినేశ్ అరోరా కార్యాలయం నుంచి తాను రెండు పెద్ద సంచుల్లో డబ్బును తీసుకెళ్లి వినోద్ చౌహాన్ అనే వ్యక్తికి అప్పగించినట్లు అతను వెల్లడించినట్లు పేర్కొంది. మరో సందర్భంలో దిల్లీ నారాయణ తోడాపూర్ సమీపంలోని చిరునామాకు రెండు సంచుల్లో డబ్బును తీసుకెళ్లి అతడికి అప్పగించినట్లు అంగీకరించాడని వెల్లడించింది. వినోద్ చౌహాన్ అదే డబ్బును గోవాలో ఆప్ ఎన్నికల ఖర్చుల కోసం హవాలా మార్గంలో పంపించినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది.
2023 మార్చి 11న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సమర్పించిన తన ఫోన్లలో ఒకదానిలో డేటాను కవిత తొలగించారని ఈడీ తెలిపింది. తాను ఫేస్ టైం, వాట్సాప్ వినియోగించినట్లు స్వయంగా అంగీకరించినా ఫోన్‌లో ఆ యాప్ ఎలాంటి డేటా లేదని పేర్కొంది. దీని గురించి అడిగితే ఆమె సమాధానం దాటవేశారని వెల్లడించింది. విశ్లేషణ నిమిత్తం తొమ్మిది ఫోన్లను అప్పగించినప్పటికీ వాటిని ఫార్మాట్ చేయడంతో డేటా లేదని విచారణలో తేలిందని వివరించింది. ఎందుకు ఫార్మాట్ చేశారని కవితను అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదని ఈడీ పిటిషన్‌లో చెప్పింది. మరోవైపు మద్యం కేసులో పలువురు నిందితుల నుంచి సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా కవిత పాత్రను ఈడీ నిర్ధారించింది. కవితను ఏడు రోజులపాటు ఈ వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నించే అవకాశం ఉంది. అనంతరం మరికొందరిని ప్రశ్నించే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు - సెల్ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
కవిత అక్రమ అరెస్టును సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం : హరీశ్‌రావు