Mission Pothole Free AP Program :రాష్ట్రవ్యాప్తంగా రహదారులు కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో రహదారుల మరమ్మతులను మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. రోడ్లపై గుంతల్లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ నిర్ణంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా రహదారులపై జనం పడుతున్న కష్టాలు తీరబోతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపై గుంతల పూడ్చే పనులు ప్రారంభమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం తిమ్మాపురం కూడలి వద్ద మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ పనులను మంత్రి సవిత ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. గత ఐదేళ్లు జగన్ గాల్లో తిరుగుతూ రోడ్లను పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు :శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రహదారులపై గుంతలను పూడ్చే కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో గుంతల రోడ్ల వల్ల ప్రమాదాలకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో రహదారి మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు భూమి పూజ చేసి ప్రారంభించారు. కళ్యాణదుర్గంలో గుంతలు పడ్డ రోడ్లను కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు కలిసి మరమ్మతులు చేపట్టారు. విడపనకల్లు-గడేకల్లు రహదారి మరమ్మతు పనులను అనంతపురం కలెక్టర్ వినోద్‌కుమార్ ప్రారంభించారు.
ఈ దుస్థితికి గత పాలకుడే కారణం - రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం: సీఎం చంద్రబాబు
రోడ్లపై గుంతలు కనపడవు :కర్నూలు జిల్లాలో మొదటి దశలో 412 కిలోమిటర్ల రోడ్డు మరమ్మతులను ప్రారంభించినట్లు మత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రహదారి పనులను ప్రారంభించారు. నంద్యాలలోని సంజీవనగర్ గేటు వద్ద రహదారి మరమ్మతులు పనులను మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో చేపట్టారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రోడ్లపై గుంతలు పూడ్చే పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఇకపై రాష్ట్రంలో రోడ్లపై గుంతలు కనపడవని చెప్పారు.