Shadnagar MLA Visited South Glass Factory Incident Place :రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం బూర్గుల సమీపంలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం భారీ పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటనా స్థలాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉదయం 10గంటల సమయంలో పరిశీలించి, కార్మికులతో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. సంఘటనలో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారంతో పాటు మృతి చెందిన ఐదు కుటుంబాలకు ఒక ఉద్యోగం చొప్పున అవకాశం కల్పించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అలాగే చికిత్స పొందుతున్న వారందరికీ పరిశ్రమ యాజమాన్యం పూర్తిస్థాయిలో మెరుగైన చికిత్స చేయించాలని ఆదేశించారు.
గ్లాస్ పరిశ్రమలో గ్యాస్ కంప్రెషర్ పేలుడు - అయిదుగురు దుర్మరణం - blast in south glass factory
అందుకే ప్రమాదం జరిగింది :ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని చెప్పారు. మృతదేహాలను పరిశ్రమ యాజమాన్యమే వారివారి స్వగ్రామాలకు పంపించాలని తెలిపారు. పరిశ్రమలో సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనల ప్రకారం పరిశ్రమలో వసతులు ఉండేలా చూడాలని, కార్మికులకు సేఫ్టీ పరికరాలు ఇచ్చేలా చేయాలని చెప్పారు. సౌత్ గ్లాస్ పరిశ్రమలో యాజమాన్యం తగిన సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నారు. యాజమాన్యంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. పరిశ్రమ యాజమాన్యంపై హత్యా నేరం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఘటనతో నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ పరికరాలు ఉన్నాయో లేదో తనిఖీలు చేపడతామని తెలిపారు.