Teeth Whitening Foods : ఎక్కువ మంది ముఖం, జుట్టు ఆరోగ్యం మీద పెట్టిన శ్రద్ధ.. నోటి ఆరోగ్యం మీద పెట్టరు. ఉదయాన్నే ఏదో మొక్కుబడిగా బ్రష్ చేసి పరుగులు తీస్తుంటారు. దీంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం, నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అనారోగ్యపూరిత అలవాట్ల వల్ల కొంతమంది దంతాలు కూడా పసుపు రంగులోకి మారుతుంటాయి. అయితే, దంతాలు ఆరోగ్యంగా ఉండడంతోపాటు, అవి తళతళా మెరిసిపోవడానికి రోజూ ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పాలు, పాల పదార్థాలు :
పాలు, పదార్థాలలో ఉండే క్యాల్షియం, మాంసకృత్తులు దంతాలపై ఉండే ఎనామిల్‌ను కాపాడతాయి. వీటిలోని ల్యాక్టికామ్లం దంతాలు హెల్దీగా ఉండేలా చేస్తాయి. తరచూ పెరుగు, జున్ను తినడం వల్ల దంతాలు మెరుస్తాయి. పెరుగులోని ఫాస్ఫరస్ దంతాలు రంగు మారకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్రకోలీ :
దంతాలపై ఏర్పడిన పసుపు రంగును తొలగించడానికి బ్రకోలీ సహాయపడుతుంది. ఇందులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల దంతాలు బలంగా ఉంటాయి. అలాగే చిగుళ్ల వాపు కూడా తగ్గుతుంది.
స్ట్రాబెర్రీలు :
వీటిలో మాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలపైన ఉండే పసుపు రంగును తొలగించి మెరిపిస్తుంది. స్ట్రాబెర్రీలలోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దంతాలపై మరకలకు కారణమైన బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. అలాగే చిగుళ్లలో వాపు రాకుండా చేస్తాయి. స్ట్రాబెర్రీలు తినడం వల్ల దంతాలపై పసుపు రంగు తొలగిపోతుందని National Institutes of Health (NIH) నిపుణుల బృందం కూడా వెల్లడించింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సిట్రస్ పండ్లు :
నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది దంతాలపై ఏర్పడిన మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే తరచూ సిట్రస్ పండ్లను డైట్లో భాగం చేసుకోవాలి.
యాపిల్ :
ఆరోగ్యంగా ఉండడానికి రోజూ ఒక యాపిల్ పండు తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు! అయితే, యాపిల్ పండ్లు దంతాల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా యాపిల్ పండ్లలో మాలిక్ యాసిడ్ అనే సహజమైన సమ్మేళనం ఉంటుంది. ఇది దంతాలపై ఏర్పడిన మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.
పైనాపిల్ :
దంతాలను సహజంగా క్లీన్ చేసి, మెరిపించే గుణం పైనాపిల్‌కు ఉంటుంది. ఇందులోని బ్రొమెలైన్ అనే ఒకరకమైన ఎంజైమ్ సహజసిద్ధ క్లెన్సర్‌గా పనిచేస్తుంది.
క్యారెట్ :
చాలా మందికి క్యారెట్ కంటి చూపును మెరుగుపరుస్తుందని తెలుసు! కానీ, వీటిని చక్కగా శుభ్రం చేసి పచ్చిగా తినడం వల్ల పళ్లపై ఇతర పదార్థాల కారణంగా పేరుకున్న బ్యాక్టీరియా, వ్యర్థాలు తొలగిపోతాయి. అలాగే క్యారెట్ నమిలే క్రమంలో దంతాలకు తగిన వ్యాయామం అంది చిగుళ్లు కూడా బలపడతాయి. ఇంకా దంతాలు మెరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్: మార్నింగ్ బ్రష్ చేయకుండా "వాటర్" తాగుతున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి!
మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే - ఈ ఆహారపదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి!