Rohit Sharma Injury Update : ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు కోసం టీమ్‌ఇండియా ప్లేయర్స్ నెట్స్‌లో చెమటోడుస్తున్న సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్యాటింగ్ సాధన చేస్తున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ స్వల్పంగా గాయపడ్డాడు. అతడి ఎడమ మోకాలికి బంతి తగలడంతో నెట్స్ నుంచి బయటకు వచ్చేశాడు. వెంటనే ఫిజియోలు రంగంలోకి దిగి, గాయమైన చోట ఐస్‌ప్యాక్ పెట్టారు. నొప్పితో కాసేపు విలవిల్లాడిన రోహిత్, దాదాపు అరగంటపాటు విశ్రాంతి కూడా తీసుకున్నాడు.
దీంతో బాక్సింగ్ టెస్టులో రోహిత్ శర్మ ఆడతాడా? లేదా అని అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా రోహిత్ శర్మ తన గాయంపై స్పందించాడు. గాయం తీవ్రమైనది కాదని, తాను ప్రస్తుతం బాగున్నానని వెల్లడించాడు. అయితే, ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే దానిపై మాత్రం సస్పెన్స్ ఉంచాడు.
"నా మోకాలు బానే ఉంది. ఎవరు ఎక్కడ బ్యాటింగ్ చేస్తారో అని ఎక్కువగా చింతించకండి. కొన్ని విషయాలు బయట పెట్టాలి. మరికొన్నింటిని బయట పెట్టకూడదు. జట్టుకు ఏది మంచిదో, ఏది అవసరమో అదే చేస్తాం. విరాట్ కోహ్లీ ఆఫ్ స్టంప్ బలహీనతను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాడు. యశస్వి జైస్వాల్ సహజశైలిని దెబ్బ తీయకూడదు. అతడు తన బ్యాటింగ్‌ను మా అందరి కన్నా బాగా అర్థం చేసుకున్నాడు. అతడిని స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహిస్తాం" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన రోహిత్ శర్మ, ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లో ఆరో స్థానంలో బరిలోకి దిగి నిరాశ పరిశాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో 10,3, 6 స్కోర్లు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ మళ్లీ ఓపెనర్‌గా రావాలని రవిశాస్త్రితో పాటు ఇతర మాజీ క్రికెటర్లు సూచించారు.
ఇక,ఈ సిరీస్ విషయానికొస్తే, మూడు టెస్టులు ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు డ్రా ముగిసింది. తొలి టెస్టులో భారత్, రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించాయి.
బాక్సింగ్ డే టెస్టు - బుమ్రా, స్మిత్‌ను ఊరిస్తోన్న అరుదైన రికార్డులు