MLA Tellam Venkat Rao Do Deliveries to Pregnant Women :ఒకవైపుపురిటి నొప్పులతో గర్భిణీలు సకాలంలో వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. మరోవైపు తమవారికి ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే నేనున్నానంటూ స్టెతస్కోప్ చేతబట్టి, విజయవంతంగా ఆపరేషన్ చేసి ఇద్దరు గర్భిణీలకు కాన్పు చేశారు. ఇద్దరు పండంటి బిడ్డలకు ప్రాణం పోశాడు.
గోదావరి వరద, భారీ వర్షాలు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని ముంచెత్తుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం అంతకంతకూ పెరిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. మన్యం పల్లెలకు, మండల కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లి జనం అడుగు బయటపెట్టలేని పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం నిండు గర్భిణీలను ముందస్తుగానే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించింది.
"బదీలలపై ఇక్కడ డాక్టర్ల కొరత ఉంది. నేను సివిల్ సర్జన్‌గా పని చేసిన అనుభవం ఉంది. అందుకే నేను వారికి ప్రసవం చేయగలిగాను. ఈ ఆస్పత్రిలో ఒక్కరే గైనాకాలజిస్ట్ ఉన్నారు. వరదల కారణంగా వారిని ఎటు తరలించే అవకాశం లేదు. ఎమ్మెల్యేగా కాకుండా నేను ముందుగా ఒక డాక్టర్‌గా స్పందించాలి. నేను వారికి ప్రసవం చేశాను." - తెల్లా వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే
భరోసా కల్పించి :ఇదే సమయంలో ఈ ఆస్పత్రిలో వైద్య నిపుణులు, సిబ్బంది బదిలీల్లో భాగంగా వేర్వేరు చోట్లకు వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్న గర్భిణీల్లో ఇద్దరికి పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కంగారుపడ్డారు. వేరే చోటకు తరలించాలన్నా సాధ్యం కాలేదు. స్వతహాగా శస్త్రచికిత్సల నిపుణుడైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆస్పత్రి వర్గాలు సమాచారాన్ని చేరవేశారు. అప్పటికే వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన ఆయన హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి నేనున్నాంటూ భరోసా కల్పించారు.