MLA Lasya Nanditha Accident Investigation : సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ ఔటర్ రింగ్ రోడ్‌పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు జరిగిన రహదారి ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఓఆర్ఆర్ రహదారిపై (ORR) రెండో లైనులో వెళుతున్న వాహనం చివరకు రెయిలింగ్ ఢీకొని అగిపోయినట్లుగా గుర్తించారు.
కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి - దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ప్రమాద స్థలం ముందు దాదాపు 500 మీటర్ల దూరం నుంచి కారు స్పేర్ పార్ట్ పడి ఉండటం, కారుపై రాక్‌శాండ్ పౌడర్ పడి ఉండటంతో టిప్పర్నుగాని, రెడీమిక్స్ వాహనాన్ని కానీ ఎమ్మెల్యే కారు ఢీకొట్టినట్టు ఒక నిర్థారణకు వచ్చారు. పోలీసులు ప్రమాద సమయంలో ఓఆర్ఆర్పై వెళ్లిన ఆరు టిప్పర్ల వివరాలు గుర్తించారు. అయితే ప్రమాదం సమయంలో డ్రైవర్ ఆకాశ్ మద్యం తాగి (Drunk and Drive) ఉన్నాడా లేదా అనే వివరాల నిర్థారణ కోసం అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పోలీసులు పంపారు.
అలాగే కారు ముత్తంగి ఔటర్ రింగ్ రహదారి దాటుతున్న సమయాలను తెలుసుకున్నారు. 22వ తేదీ రాత్రి ఇంటి నుంచి 12 గంటలకు బయలుదేరి సుజుకీ ఎక్సెల్ 6 కారులో ముందు సదాశివపేటకు వెళుతూ 12.50 గంటలకు ముత్తంగి టోల్ గేట్ క్రాస్ చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. డ్రైవర్ ఆకాశ్ చరవాణి వివరాలు కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మేజిస్ట్రేట్ ముందు ఆకాశ్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. హై ప్రొఫైల్ కేసుకావడంతో(High Profile Case) సంబంధిత డిపార్ట్మెంట్లో నిపుణులతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.