Three Girls Missing Case in Nizamabad : నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లో సంచలనం సృష్టించిన ముగ్గురు పదో తరగతి విద్యార్థినుల మిస్సింగ్ కేసు సుఖాంతం అయింది. ముగ్గురిలో ఒక అమ్మాయి శిరీష గురువారం రాత్రి 3 గంటల సమయంలో నిజామాబాద్ బస్టాండ్‌లో గుర్తించగా, మిగిలిన ఇద్దరు అమ్మాయిలు వరలక్ష్మి, రవళిక ఇవాళ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో దొరికినట్లు నవీపేట్ ఎస్‌ఐ వినయ్ తెలిపారు. విద్యార్థినులు దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసును విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు.
అసలేం జరిగింది :నవీపేట్ మండల కేంద్రంలో జనవరి 2వ తేదీన స్కూలుకు వెళ్లొస్తామని చెప్పి ఇంటి నుంచి కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలిక అనే ముగ్గురు విద్యార్థినులు బయటకు వెళ్లారు. అప్పటి నుంచి విద్యార్థినులు కనిపించకుండా పోయారు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ముగ్గురు విద్యార్థినులు స్థానిక బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరిలో గురువారం శిరీష ఆచూకీ నిజామాబాద్ బస్టాండ్‌లో లభించింది.