Mirza Wahid Remand Report in Radisson Drug Case :రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెల్లడవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. తాజాగా డ్రగ్స్ కేసులో 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్ బేగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ జరిపారు. ఇందులో మరో ఇద్దరు పెడ్లర్ల ఆచూకీ లభ్యమైంది. యాకుత్‌పురాకు చెందిన బేగ్‌కు స్థానికులైన ఇమ్రాన్, అబ్దుల్ రెహమాన్ అనే డ్రగ్ పెడ్లర్ల ద్వారా కొకైన్ సరఫరా అయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో వారిద్దరి కోసం సైబరాబాద్ పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై, డెలివరీ చేస్తున్న ముఠా : మీర్జా వాహిద్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలను పోలీసులు ఇవాళ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానందకు డ్రగ్స్ అందించడంలో అతని డ్రైవర్ ప్రవీణ్‌కు డ్రగ్ పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ సరఫరాదారుగా(Drugs Supply) ఉన్నట్లు తేలింది. వివేకానంద్ ఆదేశాలతో ప్రవీణ్‌కు డ్రగ్స్ అందజేస్తున్నట్లు రిపోర్ట్‌లో తెలిపారు.
'రాడిసన్ డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు' - హైకోర్టులో దర్శకుడు క్రిష్ పిటిషన్
స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ మీర్జా వాహీద్ బేగ్ డ్రగ్స్ సప్లై, డెలివరీ చేస్తున్నట్లు వెల్లడించారు. అతడి నుంచి 3.58 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సయ్యద్ అలీ ద్వారా వివేకానందకు డ్రగ్స్ సరఫరా జరిగినట్లు, ఫిబ్రవరిలోనే 10సార్లు డ్రగ్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మీర్జా వాహిద్ రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్(Director Krish) పేరు ప్రస్తావన వచ్చినట్లు పేర్కొన్నారు.