Miryalaguda Road Accident :నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in Nalgonda)జరిగింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతలకు వెళ్లిన కారును లారీ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాల్లోని ఆరుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.మృతుల్లో ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు. ఈ ప్రమాదంతో ఉలిక్కిపడ్డ బాధిత కుటుంబసభ్యులు ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ప్రమాదంలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె రిషిత, మహేశ్ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్, ఆయన కుమారుడు లియాన్సీ అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్ భార్య మాధవి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించి తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంలో కారు నుజ్జనుజ్జయింది.
వాటర్ఫాల్స్కు వెళ్లి వస్తూ అనంతలోకాలకు- లారీ, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం
Nalgonda Road Accident Today : మహేశ్, మహేందర్ కుటుంబాలకు చెందిన వారంతా ఈ నెల 26న రెండు కార్లలో 13 మంది కుటుంబ సభ్యులు కలిసి పలు ఆలయాను దర్శించుకునేందుకు వెళ్లారు. ఇందులో భాగంగా విజయవాడ సమీపంలోని మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లి తిరుగు పయనమయ్యారు. ఆదివారం రాత్రి ఇంటికి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు మిర్యాలగూడెం నందిపాడు కాలనీకి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ మలుపు తిరిగితే మూడు, నాలుగు నిమిషాల్లో ఇంటికి వెళ్లే వారని ఇంతలో లారీ మృత్యు రూపంలో ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు.