Raithu Bharosa Update : రైతు భరోసా కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సంక్రాంతి తర్వాత నిధులను జమ చేస్తామని ప్రకటించారు. దీనిపై కొంత వివాదం నడిచిన నేపథ్యంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనే అంశాలపై నలుగురు మంత్రులతో సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. సచివాలయంలో రైతు భరోసాపై మంత్రుల సబ్‌కమిటీ నేడు సమావేశమయ్యింది. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తున్నాం అని పేర్కొన్నారు. సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందించేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రెండు గంటల పాటు మంత్రులు పలు విషయాలపై చర్చించారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరు, కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారం పైన మంత్రులు కసరత్తు చేశారు.
వ్యవసాయ కమిషన్ ఏర్పాటు : రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించామన్నారు. రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ కింద రెండు నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్ల నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుల సంక్షేమానికి కృషి చేసేందుకు వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు.