Minister Uttam Kumar Reddy on PDS : గత ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల జోక్యంతో సివిల్ సప్లయ్ వ్యవస్థపై నమ్మకం పోయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పౌరసరఫరాల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రైస్ మిల్లర్లపై ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ రైస్ మిల్లర్ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం జోలికి వెళ్లవద్దని మంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజులపాటు జరగనున్న 16వ మూకాంబికా రైస్, గ్రెయిన్‌టెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్- 2024ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. బహుళ జాతి, ప్రవేటు కంపెనీల ఆధ్వర్యంలో 120 స్టాళ్లు కొలువు తీరాయి. పలు స్టాళ్లను కలియ తిరిగి మంత్రి పరిశీలించారు. పలు దేశాల బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు, దేశీయంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడారు.
రాష్ట్రంలో పలువురు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 40 రూపాయలకు సేకరించి 6 కిలోల చొప్పున నిరుపేదలకు ఇస్తుంటే, ప్రజా పంపిణీ బియ్యాన్ని పలువురు మిల్లర్లు రీసైక్లింగ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని హెచ్చరించారు. కొందరు చట్ట విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నందున కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. కీలక వ్యవసాయ అనుబంధంగా రైస్ మిల్లింగ్ పరిశ్రమను ప్రభుత్వం ముఖ్యమైన రంగంగా గుర్తిస్తుందని అన్నారు.