Minister Tummala Nageswara Rao Chitchat on Purchase of Seeds :రాష్ట్రంలో విత్తనాల కోసం ఎక్కడా తొక్కిసలాట జరగలేదని, రైతులపై లాఠీ ఝళించలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విత్తనాలు, రసాయన ఎరువుల కొరత అంటూ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా నుంచి కొందరు ఎక్స్ వేదికగా సామాజిక మాధ్యమాలకు పంపుతున్నారని తప్పుబట్టారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు, రసాయన ఎరువుల కొరత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రధాన వాణిజ్య పంట పత్తి, పచ్చిరొట్ట, ఇతర పంటల విత్తనాలు లేవంటూ ఎవరో సృష్టించిన అపోహలకు రైతులు లోనుకావద్దని మంత్రి చెప్పారు. విపక్షాలు రైతులతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. గత ఐదు మాసాలుగా విద్యుత్, సాగు నీరుపై రాజకీయం చేశారు, ఎలాంటి ఫలితాలు రాలేదని ఆక్షేపించారు. ఇంత రాద్ధాంతం చేసి ఆదుర్ధా సృష్టిస్తే విపక్షాలకు ఏమైనా క్షణికానందం కలిగిందేమో? అని విమర్శించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం నియమావళి అమల్లో ఉన్నప్పటికీ ఎప్పికప్పుడు లేఖలు రాసి అనుమతులు తీసుకుని ఖరీఫ్ సీజన్ కోసం విత్తన నిల్వలు, రసాయన ఎరువులు, ఇతర ఉపకరణాలు అందుబాటులోకి చేర్చడం ద్వారా ముందస్తు ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విపక్షాలు ఈ రకంగా బదనాం చేయాలనుకుంటే రైతులను ఆందోళనకు గురిచేయడమేనంటూ ఆరోపించారు. ఏ విధమైన అపోహలకు తావు లేదు. రాజకీయ లబ్ధి పొందాలని రైతులను తప్పుదోవ పట్టిస్తే నమ్మవద్దని మంత్రి తుమ్మల సూచించారు.