Minister Seethakka Comments On Bad Movies :సమాజంలో సినిమాల పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. చెడు సినిమాల వల్ల సమాజం అక్రమ మార్గాల్లోకి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా లీలా గార్డెన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
అందుకే వారు గగ్గోలు పెడుతున్నాయి :సంధ్య థియేటర్ ఘటనను తమ పార్టీ రాజకీయం చేసిందని బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ఇందులో రాజకీయం ఎక్కడ ఉందో తనకు అర్థం కావడంలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు మరోలా మాట్లాడుతున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిపై ఉందని, ఇలాంటి తొక్కిసలాట ఘటనలను నివారించాలి, అందుకే చర్యలు తీసుకున్నారని తెలిపారు. దీనికే బీఆర్ఎస్, బీజేపీలు గగ్గోలు పెడుతున్నాయని ఆక్షేపించారు.
సెంటిమెంటును రాజకీయాలకు వాడుకోం :కొన్ని వర్గాలు సంధ్య థియేటర్ ఘటనలో సెంటిమెంట్ల కోసం చాలా ప్రయత్నిస్తున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. తాము సెంటిమెంటును గౌరవిస్తాం కానీ వాటిని రాజకీయాల కోసం వాడుకోమని వివరించారు. అక్కడ జరిగిన ఘటననే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే దానిని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన(అల్లు అర్జున్) మీద మాకు కోపం లేదు అని సీతక్క తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే అనే మాటను అందరూ గుర్తుంచుకోవాలని సీతక్క హితవుపలికారు.