New Revenue Act-2024 in Telangana :దేశానికి రోల్ మోడల్‌గా ఉండేట్లు కొత్త రెవెన్యూ చట్టం-2024ను తీసుకురానున్నట్లు రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్‌తో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల నుంచి విముక్తి చేసేందుకు వీలుగా ఈ చట్టం ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశమయ్యారు.
ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి : ప్రజలు కోరుకున్నట్లు, రైతుకు సమస్యలు పరిష్కారమయ్యేట్లు సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలు అందుబాటులో ఉండేలా చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, కొత్త రెవెన్యూ చట్టం రాక ముందే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరి తొందరపాటు చర్యలు తీసుకుని రైతులను సమస్యల కూపంలోకి నెట్టే పనిని తమ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు.
సలహాల స్వీకరణ : నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు ఉద్యోగులు, మేధావులు, నిపుణులు ఇలా అన్ని వర్గాలను సంప్రదించి సూచనలను, సలహాలను స్వీకరించినట్లు వివరించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టుల్లో ఎదురయ్యే లోటు పాట్లను కూడా పరిగణనలోకి తీసుకుని నూతన చట్టాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఉద్యోగుల ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.