తెలంగాణ

telangana

ETV Bharat / state

యూనిక్ నెంబర్‌తో స్మార్ట్‌కార్డు- హెల్త్ ప్రొఫైల్‌ పైలట్​ ప్రాజెక్టుపై మంత్రి పొంగులేటి కీలక విషయాల వెల్లడి - Digital Health Profile Card Project - DIGITAL HEALTH PROFILE CARD PROJECT

Digital Health Profile Card Project : రాష్ట్రంలోని ప్రతికుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ కార్డు పైలట్ ప్రాజెక్టును ఆర్డీవో స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. దసరాలోపు లబ్ధిదారులకు రెండుపడక గదుల ఇళ్లు ఇవ్వాలని, యూడీఏ పరిధి పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకి సూచించారు.

Digital Health Card Guidelines
Digital Health Profile Card Project (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2024, 7:18 AM IST

Updated : Oct 2, 2024, 7:26 AM IST

Digital Health Card Guidelines : ఫ్యామిలీ డిజిటల్ కార్డు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి, ఎల్​ఆర్ఎస్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సీఎస్ శాంతికుమారితో కలిసి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటల్‌ కార్డులో పొరపాట్లకు తావివ్వకుండా వాస్తవాలకు దగ్గరగా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.

యూనిక్ నెంబర్‌తో స్మార్ట్‌కార్డు : పేద, మధ్య, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి యూనిక్ నెంబర్‌తో స్మార్ట్‌కార్డు ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 119 నియోజకవర్గాల్లోని 238చోట్ల పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. నియోజకవర్గానికి రెండు లెక్కన ఎంచుకోవాలని సూచించారు. ఈ నెల మూడవ తేదీన నుంచి ఏడో తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి పకడ్బందీగా వివరాలు సేకరించాలని మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు..

డిజిటల్‌ కార్డుల వివరాల సేకరణ పర్యవేక్షణకు నియోజకవర్గానికి ఆర్టీవో స్థాయి, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. మండలానికి తహశీల్దారును నియమిస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. హెల్త్ కార్డుల విధానం, అమలు, ఫలితాలపై అధికారుల బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక అందించినట్లు తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా పైలట్‌ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు. ఆ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఈ నెల మూడవ తేదీన ప్రారంభిస్తారని పొంగులేటి వెల్లడించారు. అందులో ఎదురయ్యే మంచి చెడులను, పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలను పరిశీలిస్తామని వివరించారు. నాలుగైదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎల్​ఆర్ఎస్ దరఖాస్తులను యుద్ధప్రతిపాదికన పరిష్కరించాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.

ఎల్​ఆర్ఎస్​పై అంతృప్తి :కొన్ని జిల్లాల్లో వేలసంఖ్యలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వస్తే పదుల సంఖ్యలో పరిష్కరించడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధి పెంపు, కొత్త యూడీఏల ఏర్పాటు ప్రతిపాదనలని వెంటనే పంపాలని కలెక్టర్లని ఆదేశించారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి అరకొరగా రెండు పడకగదుల ఇళ్లు నిర్మించిందని, అందులో కొన్ని మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. వాటి లబ్ధిదారులను ఎంపిక చేసి దసరా లోపు అప్పగించాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచించారు.

ఇందుకోసం జిల్లా ఇన్-చార్జ్ మంత్రి ఛైర్మన్‌గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా మరికొంత మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న జిల్లాలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకి నిధులు కేటాయించినట్లు వివరించారు. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అంగన్ వాడీ కేంద్రాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు 35 సన్నరకాల ధాన్యానికి క్వింటాలుకు 500 బోనస్ ఈ ఖరీఫ్ నుంచే అమలు చేస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రవ్యాప్తంగా 7వేల144 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, సన్న, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఉంటాయని చెప్పారు. రైతులకు సమస్యరాకుండా కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.

హైడ్రాకి ఇక స్పెషల్ పవర్స్ - ప్రభుత్వ ఆర్డినెన్స్‌కి గవర్నర్‌ ఆమోదం - GOVERNOR APPROVED HYDRA ORDINANCE

'ఇంటి మహిళే యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు' - CM On Family Digital Health Cards

Last Updated : Oct 2, 2024, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details