Minister Nimmala Ramanaidu Spoke at Legislative Council : పోలవరం ప్రాజెక్టును ఎత్తును తగ్గించాలని 2022 జనవరి 10వ తేదిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి ప్రాజెక్టు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు. అప్పటి తెలంగాణ సీఎంతో జగన్ కుమ్మక్కై పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించారని శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు నిమ్మల రామానాయుడు సమాధానంగా చెప్పారు.
పోలవరంపై కేబినెట్లో చర్చ- నిధులన్నీ కేంద్రమే ఇవ్వాలని తీర్మానం - Polavaram Project Funds
పోలవరంని బ్యారేజీగా మార్చే కుట్ర : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టులో ఎత్తును తొలుత నిర్ణయించినట్లుగానే 45.72 మీటర్లకు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయనున్నట్లు సభ్యులకు వివరించారు. ఈ మేరకు మంత్రి వర్గం సమావేశమై తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. ప్రాజెక్టులో 45.72 మీటర్ల వద్ద 194.60 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి చేటు చేయడమే కాకుండా బ్యారేజీగా మార్చే ప్రయత్నం చేసిందని అన్నారు.