ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడేళ్లలో అమరావతి సిద్ధం - డిసెంబర్​లోగా​ టెండర్లు పూర్తి - క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ

ప్రపంచంలోని ఐదు నగరాల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా చర్యలు - ఇంజినీర్ల కమిటీ నివేదిక ప్రకారం సీఆర్‌డీఏ ముందుకెళ్తుందన్న మంత్రి నారాయణ

Minister Narayana Media Conference on Capital Amaravati Works
Minister Narayana Media Conference on Capital Amaravati Works (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2024, 4:58 PM IST

Updated : Nov 4, 2024, 5:42 PM IST

Minister Narayana Media Conference on Capital Amaravati Works :ప్రపంచంలోని ఐదు నగరాల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా ప్రణాళికలు వేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్‌ చివరిలోగా అమరావతికి సంబంధించిన అన్ని టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. ప్రస్తుతం మంత్రులు, జడ్జిలు, ఇతర బంగ్లాలకు రూ.41 వేల కోట్ల టెండర్లు పిలిచామని గుర్తుచేశారు. అందులో రూ.30 వేల కోట్ల టెండర్లకు సంబంధించి పనులు ఇప్పటికే మొదలయ్యాయని వివరించారు. అమరావతి రాజధాని పనులపై మంత్రి నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు.

మూడేళ్లలో పనులు పూర్తి :గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందని మంత్రి విమర్శించారు. జులై 24న చీఫ్‌ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ అక్టోబర్‌ 29న నివేదిక ఇచ్చిందని తెలిపారు. రాజధాని అమరావతిలో మూడేళ్లలో పనులు పూర్తి కావాలని సీఎం ఇప్పటికే ఆదేశించినట్టు తెలిపారు. నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణం చేపడతామని, ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కులు పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు సైతం రూ.15 వేల కోట్ల రుణం ఇస్తుందని గుర్తుచేశారు. ఇంజినీర్ల కమిటీ నివేదిక ప్రకారం సీఆర్‌డీఏ ముందుకెళ్తుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో మూడు కాలువలు వస్తున్నాయన్నారు. వైకుంఠపురం, లామ్ సహా మిగతా చోట్ల రిజర్వాయర్ లు పెట్టాలని నెదర్లాండ్స్ కంపెనీ సూచించిందని తెలిపారు. మళ్లీ టెండర్లు పిలవాలంటే కనీసం 10-15 శాతం ధరలు పెరుగుతాయన్నారు. గతంలో 5 వేల కోట్లు వ్యయం చేశామని గుర్తు చేశారు.

మూడేళ్లలో అమరావతి సిద్ధం - డిసెంబర్​లోగా​ టెండర్లు పూర్తి - క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ (ETV Bharat)

నిలిచిపోయిన టెండర్లు రద్దు : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్‌తో పాటు ఆయా శాఖల అధికారులు, సీఆర్‌డీఏ కమిషనర్‌ పాల్గొన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో నిలిచిపోయిన రాజధాని నిర్మాణాలపై సమావేశంలో చర్చించారు. దీనిపై ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు 2014-19 మధ్య పనులు చేపట్టి, గత ఐదేళ్లుగా నిలిచిపోయిన టెండర్లను రద్దు చేసేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఆయా సంస్థలతో మాట్లాడి కొద్ది రోజుల్లోనే టెండర్ల రద్దు ప్రక్రియను ముగిస్తామని మంత్రి నారాయణ సమావేశం తర్వాత వెల్లడించారు.

అమరావతి లోపల, బయట రిజర్వాయర్లు : రహదారులు, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్‌, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, న్యాయవాదుల బంగ్లాలు,మంత్రుల నివాసాలతో పాటు ఇతర నిర్మాణాలకు ప్రస్తుత అంచనాల మేరకు డిసెంబర్‌ 31లోగా మళ్లీ టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు. ఐకానిక్‌ భవనాలుగా నిర్మిస్తున్న హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు మాత్రం జనవరి చివరిలోగా టెండర్లు పిలుస్తామని చెప్పారు. అన్ని పనుల్ని మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు నారాయణ వివరించారు. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణం మంజూరు నిబంధనల్లో భాగంగా రాజధానిలో పర్యావరణంతో పాటు ముంపు సమస్య లేకుండా అమరావతి లోపల, బయట రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

జనవరి నుంచి రాజధాని పనులు - డిజైన్లలో నో ఛేెంజ్​: మంత్రి నారాయణ

అమరావతి టవర్లకు మళ్లీ ఊపిరి - తొమ్మిది నెలల్లో మారనున్న రూపురేఖలు

Last Updated : Nov 4, 2024, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details