Minister Konda Surekha Review on Bonalu Jathara :రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండగను అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బోనాల పండగను ఘనంగా నిర్వహించేందు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జులై 7వ తేదీ నుంచి బోనాల జాతర ప్రారంభమవుతుందని తెలిపారు. బోనాల మహా జాతర ఏర్పాట్లపై అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆషాఢ మాసం బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
నామినేట్ మంత్రులతో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ :గతంలో మాదిరిగా అరకొర నిధులతో, అసౌకర్యాలతో కాకుండా ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. బోనాల పండుగకు రూ.25 కోట్ల నిధులను మంజూరు చేసేలా సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతానని తెలిపారు. బోనాల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. నగరంలో 28 ఆలయాలు ఉన్నాయని నామినేట్ చేసిన 9 మంది మంత్రులతో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామని చెప్పారు.
బోనాల జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, మెట్రో, ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. ఉచిత బస్సు సౌకర్యం ఉండటం వల్ల ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు తగ్గట్లుగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాల్లో కళాబృందాలను తీసుకురావడంతో పాటు, లేజర్ షోలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.